కోటి మంది స్నానమాచరిస్తారని అంచనావేస్తున్న గోదావరి పుష్కరాలు నిఘా నీడలో జరగనున్నాయి. కొన్నేళ్ల క్రితం నుంచి ఉగ్రవాదులు ఇలాంటి
సాక్షి, రాజమండ్రి: కోటి మంది స్నానమాచరిస్తారని అంచనావేస్తున్న గోదావరి పుష్కరాలు నిఘా నీడలో జరగనున్నాయి. కొన్నేళ్ల క్రితం నుంచి ఉగ్రవాదులు ఇలాంటి జనసమ్మర్థ కార్యక్రమాల్లో పేట్రేగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి అసాంఘిక శక్తులకు ఆస్కారం ఇవ్వకుండా భద్రతాపరమైన ఏర్పాట్లను పక్కాగా చేపడుతోంది. ఈ నెల 14 నుంచి పుష్కర స్నానాలు ఆచరించే ఉభయ గోదావరి జిల్లాల్లోని ఘాట్లలో, కూడళ్లలో మొత్తం 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 171 సీసీ కెమెరాలను రాజమండ్రిలో రిలయన్స్ జియో ఏర్పాటు చేసింది.
వీటిని సుమారు 33 కిలోమీటర్ల పొడవైన ఆప్టిక్ ఫైబర్‌తో పోలీసు కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసింది. పుష్కరాలు పూర్తయ్యే వరకూ వీటిని ఆ సంస్థ నిపుణులే పర్యవేక్షిస్తారు. ఇక ఇరు జిల్లాల్లోని అన్ని సీసీ కెమెరాల్లో బంధించే దృశ్యాలను వీక్షించేందుకు రాజమండ్రి పోలీసు గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో 12 నుంచి 16 అంగుళాల ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఘాట్‌లు, ట్రాఫిక్ కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాలు, పుష్కర్ నగర్‌లలో పరిస్థితిపై పోలీసులు నిత్యం నిఘా ఉంచడానికి అవకాశం కలుగుతుంది. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే స్క్రీన్‌పై దృశ్యాన్ని జూమ్ చేసి చూస్తారు. అలాగే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు ఎక్కడ తలెత్తినా సిబ్బందిని అప్రమత్తం చేయడానికీ సీసీ కెమెరాలు సహాయపడనున్నాయి.
పోలీసుల మోహరింపు...
పుష్కరాలు ప్రశాంతంగా ముగిసేలా, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 28 వేల మంది పోలీసులను మోహరించనుంది. అత్యంత ముఖ్యమైన వ్యక్తులు (వీఐపీలు) సందర్శించే అవకాశమున్న రాజమండ్రిలోనే 15 మంది ఎస్పీ స్థాయి అధికారులు, 30 మంది ఏఎస్పీలు, 90 మంది డీఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. అలాగే ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఘాట్‌లకు వెళ్లే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
బారికేడ్లు ఇంత ఇరుగ్గానా...
బారికేడ్ల మధ్య వెడల్పు రెండు మూడు అడుగులు మాత్రమే ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు. తిరుపతికి, గోదావరి పుష్కరాలకు చాలా వ్యత్యాసం ఉందని అభిప్రాయపడుతున్నారు. తిరుపతిలో భక్తులంతా ఒక్కచోటే వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని, అక్కడ రద్దీని నియంత్రించడానికి ఇరుకైన బారికేడ్లు సమంజసమేనని చెబుతున్నారు. గోదావరి పుష్కరాలకు మాత్రం విశాలమైన ఘాట్లలో ఎక్కడైనా స్నానం ఆచరించవచ్చని, అలాంటప్పుడు తిరుపతి మాదిరి బారికేడ్లు సరికాదని విమర్శిస్తున్నారు.