గోదావరి పుష్కరాలకు వస్తుండగా జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో శనివారం ఆరుగురు మృతి చెందగా, ఘాట్ వద్ద వ్యాన్ ఢీకొని మరొకరు, గోదావరిలో మునిగి ఒక బాలుడు మృత్యువాతపడ్డారు.
కారు ఢీకొని తండ్రి, కొడుకులు మృతి
గండేపల్లి : గోదావరి పుష్కర స్నానం కోసం బయలుదేరిన శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఒక కుటుంబం మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. జె.రాగంపేట ఆదిత్య ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. పాలకొండకు చెందిన పడాల దుర్గాప్రసాద్ భార్య అనురాధ, కుమారులు యశ్వంత్, షణ్ముఖ్, బావమరిదితో కలిసి కారులో రాజమండ్రి బయలు దేరారు. జెడ్.రాగంపేట వద్దకు వచ్చేసరికి కారును రోడ్డు పక్కన ఆపి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇద్దరు పిల్లలను ప్రసాద్ రోడ్డు అవతలి వైపునకు తీసుకు వెళుతుండగా విశాఖ వైపు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమైన యశ్వంత్ (9) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్ (45), షణ్ముఖ్‌లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జగ్గంపేట, గండేపల్లి ఎస్సైలు సురేష్‌బాబు, రజనీకుమార్‌లు అక్కడకు చేరుకుని గాయపడ్డ ఇద్దరినీ మరో కారు లో పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ప్రసాద్ మృతి చెం దాడు. షణ్ముఖ్‌ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘనతో అనురాధ షాక్‌కు గురైంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరి మృతి
ముమ్మిడివరం /అయినవిల్లి : గేదెల్లంక పుష్కర తీరంలో శనివారం పుష్కర స్నానాలకు భక్తులను తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 12 మంది క్షతగాత్రులయ్యారు. అయినవిల్లి మండలం ఎస్.మూలపొలం గ్రామానికి చెందిన 37 మంది ట్రాక్టర్‌లో గేదెల్లంకకు బయలుదేరారు. ట్రాక్టర్ ఏటిగట్టు ర్యాంపు దిగుతున్న సమయంలో అదుపుతప్పడంతో ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో చింతలపూడి సావిత్రి (65), మరువాడ వీరమోిహ ని (45) ట్రక్కు కింద చిక్కుకుని మృతి చెందాడు. 12 మందికి గాయాలయ్యాయి. ముమ్మిడివరం ప్రభుత్వ వైద్యాధికారిణి శాంతమణి సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి అమలాపురం ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ ఎల్ అంకయ్య, ఎస్సై అప్పల నాయుడు, ఇన్‌చార్జి తహశీల్దార్ జె.వెంకటేశ్వరి, ఎంపీడీఓ వి.ధనలక్ష్మీదేవిలు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు బాధితులను పరామర్శించారు. మృతదేహాలను మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి గుత్తుల సాయి, నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ కాశి బాలమునికుమారి సందర్శించారు.
ఎస్.మూలపొలంలో విషాదఛాయలు
ట్రాక్టర్ బోల్తా ఘటనలో అయినవిల్లి మండలం ఎస్.మూలపొలానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలు మోహిని గృహిణి. ఆమె భర్త శ్రీనివాసరావు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. వారికి సాిహ త్య, సుదీప్తి అనే ఇద్దరు కుమార్త్తెలున్నారు. మరో మృతురాలు సావిత్రి భర్త గోవిందు 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఈశ్వరి, చిన్ని అనే ఇద్దరు కుమార్తెలున్నారు.
కారు ఢీకొని యాత్రికురాలు మృతి
ప్రత్తిపాడు : ప్రత్తిపాడు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ జిల్లా కె. కోటపాడు మండలం అలమండ కోడూరుకు చెందిన లావేటి పాపయ్యమ్మ (50) మృతి చెందింది. గ్రామానికి చెందిన మరికొంత మందితో కలిసి పుష్కరస్నానం చేసేందుకు రాజమండ్రి బయలుదేరింది. ప్రత్తిపాడు వద్ద బస్సు నుంచి దిగిన ఆమె బహిర్భూమికి వెళ్లి రోడ్డు దాటి తిరిగి వస్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
వ్యాన్ అదుపుతప్పి మహిళ మృతి
కోటిలింగాల ఘాట్(రాజమండ్రి) : కోటిలింగాలఘాట్‌లో వాటర్ ప్యాకెట్ల బస్తాలతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి దూసుకురావడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒడ్డ మీనాక్షి (70) మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా జల్లుమూరు మండలం మల్లివలసకు చెందిన మీనాక్షితో పాటు మరికొందరు శనివారం తెల్లవారుజామున శ్రీకాకుళం నుంచి కోటిలింగాలఘాట్‌కు చేరుకున్నారు. ఐదో నంబర్ అప్రోచ్ రోడ్డు మీదుగా వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి వృద్ధురాలిని ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. కలెక్టర్ అరుణ్‌కుమార్ బాధితులను ఓదార్చారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గోదావరిలో పడి బాలుడి మృతి
దేవీపట్నం : వీరవరం గ్రామానికి చెందిన ఇనపాల భవితేజ (5) సమీపంలో పంట పొలాల వద్ద గోదావరి నదిలో తన తల్లితో కలసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడడంతో నదిలో కొట్టుకుపోయాడు. అరగంట తర్వాత దిగువన గల పోశమ్మగండి వద్ద బాలుడి మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవీపట్నం ఎస్సై నున్న రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పుష్కర విషాదం
Published Sun, Jul 19 2015 1:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement