రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె తథ్యం: ఏపీ ఎన్జీవోల స్పష్టీకరణ
‘‘ఇక జరిగేది యుద్ధమే. ఇది పౌర విప్లవం. దీన్ని ఉద్యోగులు ముందుకు నడిపించబోతున్నారు. శాంతియుత పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపచేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాబోతున్నాం’’ అని ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్‌టీసీ సిబ్బంది, సహకార సంస్థల సిబ్బంది సమ్మె చేయనున్నట్లు ఆయన స్పష్టంచేశారు. 1986 తర్వాత ప్రభుత్వ వ్యవస్థ మొత్తం సమ్మెలోకి వెళ్లటం ఇదే ప్రథమమని ఆయన శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించిన తీరు తమను బాధించిందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఉద్యమం ఎగసిపడుతుందని శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. విభజన తప్పనిసరయితే మూడు ప్రాంతాల ప్రజల్ని ఒప్పించి చేయాలని ఆ కమిటీ సూచించిందని.. కానీ ఏకపక్షంగా రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలమని ప్రకటించాయని పేర్కొన్నారు. తాము ఒక పార్టీకి, వ్యక్తికి, వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించటం లేదన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ సొంత ప్రయోజనాల కోసం తలొగ్గినందున వారికి పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఈ ఉద్యమం ద్వారా ప్రజలకు చిన్న చిన్న కష్టాలు వచ్చినా విభజన వల్ల కలిగే నష్టం కన్నా తక్కువేనని.. ప్రజలు అర్ధం చేసుకుని తమకు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆంటోనీ కమిటీ వేసినా కాంగ్రెస్ పార్టీ నిజాయితీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. విభజన తప్పదు, మీ అభిప్రాయాలు చెప్పండంటూ నాయకులు మాట్లాడటం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను బాధించిందన్నారు. వైద్యశాఖలో కూడా అత్యవసర వైద్య సిబ్బంది మినహా అందరూ సమ్మెకు వెళ్తారని స్పష్టం చేశారు. ‘సమ్మెకు వెళ్లవద్దని కాంగ్రెస్ నాయకులు తెస్తున్న ఒత్తిళ్ల ప్రభావం మీపై ఉందా?’ అని ప్రశ్నించగా.. సమస్య పరిష్కారం అవుతుందనే భావన మాకు కలిగే వరకూ సమ్మె ఆగదన్నారు. 1972 జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా 132 రోజులు సమ్మె చేశారని.. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రోజులు చేయాల్సి వచ్చినా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. విభజన నిర్ణయం వల్ల ఒక తరం నష్టపోతుందన్నారు. సచివాలయంలో జరుగుతున్న ఆందోళనల్లో సీమాంధ్ర ఉద్యోగులతో పాటు తెలంగాణాలోని సమైక్య ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. ఆర్‌టీసీ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు పి.దామోదరరావు, ఆర్.వి.వి.ఎస్.డి.ప్రసాదరావు మాట్లాడుతూ 13వ తేదీ మొదటి షెడ్యూల్ నుంచి సీమాంధ్రలోని 123 డిపోలలో బస్సులు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా 70 వేల మంది కార్మికులు ఈ సమ్మెలో భాగస్వాములౌతారన్నారు. ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం, కో-ఆపరేటివ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కె.యోగేశ్వరరెడ్డి, టి.వి.ఫణి, పేరరాజులు కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. ఇంకా వివిధ సంఘాల ప్రతినిధులు కె కుల్లయ్యప్ప, పి.శ్రీనివాసులు, కె.మధుసూధనరాజు, ఎం.డి.ఇక్బాల్, జె.బాలాజీ, బి.వెంకటరాములు, జె.రమేష్‌కుమార్, సి.హెచ్.శ్రీనివాసరావు, డాక్టర్ కె.నగేష్‌బాబు, ఎం.సాంబశివరావు, ఎన్‌జీవో నేతలు బి.చంద్రశేఖరరెడ్డి, ఎ.విద్యాసాగర్, డి.సత్యనారాయణరెడ్డి, కోనేరు రవి, వి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
12 నుంచి పంచాయతీరాజ్ విస్తరణాధికారుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం 13 జిల్లాల్లోని పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ విస్తరణాధికారులు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు విస్తరణాధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.