బంగారు నగలను వేలం వేస్తారని..
ఆందోళనతో వెళ్తూ ప్రమాదానికి గురైన రైతు
తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలు
బనగానపల్లె రూరల్: వ్యవసాయ పెట్టుబడుల కోసం తాకట్టు పెట్టిన బంగారు నగలను బ్యాంకువారు వేలం వేస్తామని చెప్పడంతో ఆందోళనకు గురైన ఓ రైతు బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. బాధితుడి వివరాల మేరకు.. చెర్లోకొత్తూరుకు చెందిన కంబయ్య బనగానపల్లె ఆంధ్రా బ్యాంకులో 4 తులాల బంగారు నగలను తాకట్టుపెట్టి రూ. 65వేల పంట రుణం తీసుకున్నాడు. పంటలు సరిగా పండకపోవడం, ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా ఫలితం లేకపోవడంతో నగలు వేలానికి వచ్చాయి.
అప్పు కట్టి విడిపించుకోవాలని బ్యాంకు వాళ్లు చెప్పగా మాట్లాడేందుకు బైక్‌పై వెళ్లాడు. అయితే అప్పు చెల్లించపోతే వేలం వేస్తామని బ్యాంకు తేల్చి చెప్పడంతో బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు. అప్పటికే తీవ్ర ఆందోళనతో ఉన్న రైతు యాగంటిపల్లె సమీపంలోని సాయిబాబా గుడి వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళ్లారు.