బేబీనాయనను చుట్టుముట్టిన గొల్లపల్లి జనం
విజయనగరం, బొబ్బిలి: ఆయనో మాజీ కౌన్సిలర్. గొల్లపల్లిలో ఉన్న ప్రజలను ఏదో ఒక అంశంలో వేధించడం, గ్రామ పెద్దలు, ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే రాజుగారి మనిషిని నేను. ఆయన ఆదేశాలతోనే చేస్తున్నా. వ్యతిరేకిస్తే పోలీస్‌స్టేషన్‌లో చూసుకుందాం. అట్రాసిటీ కేసులు పెడతానంటూ బెదిరించడం పరిపాటైంది. గ్రామంలో ఇళ్ల స్థలాలను కబ్జా చేయడం ఇతరులకు విక్రయించడం చేస్తున్నా సహించిన గ్రామస్తులు కుటుంబ వ్యవస్థ మీదకు వచ్చిన ఆ మాజీ కౌన్సిలర్ అంతు చూడాల్సిందేనంటూ పట్టుబట్టారు. గ్రామంలోని మహిళల మీద అసభ్యకర పదజాలంతో బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఓపిక నశించి అంతా ఒకటయ్యారు. తాను చేస్తున్న పనులన్నింటికీ రాజుల పేరు చెబుతుండడంతో ఆయన దగ్గరకే వెళ్లి అమీ తుమీ తేల్చుకునేందుకు కోటలోకి వెళ్లారు. చివరకు యువరాజు బేబీనాయన కూడా ఈ సంఘటనను తేలిగ్గా తీసుకున్నారంటూ ఉసురుమంటూ వెనుతిరిగారు. ఇంతమంది ప్రజలు వచ్చి మొత్తుకున్నా మాకు న్యాయం చేయలేదంటూ నిరుత్సాహం చెందారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాలను ఆ గ్రామానికి చెందిన ప్రజలు వివరించారు.
అన్నింటా ఆయనదే హవా..
గొల్లపల్లిలో మాజీ కౌన్సిలర్ కాకల వెంకటరావు అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేటు కార్యక్రమాల్లో తన హవా ప్రదర్శిస్తున్నాడు. ఎస్సీ, బీసీల మధ్య అంతరాలను పెంచుతూ తనదే పైచేయంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ తనకు రాజుల అండ ఉందంటూ చెబుతుంటాడు. దీంతో ప్రజలు ఇన్నాళ్లూ రాజుల మీద గౌరవంతో పడుతూ వచ్చారు. ఇటీవల బీసీల కుటుంబ వ్యవస్థ మీద దెబ్బకొట్టేలా ఓ వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్ హరిజన బాలిక, బీసీ యువకుడితో ప్రేమ వివాహాన్ని నిర్వహించారు. కాకల వెంకటరావు చేపట్టిన ఈ కులాంతర వివాహాన్ని స్థానికులు, కుటుంబ సభ్యులు అడ్డుకోకపోయినప్పటికీ గ్రామంలో ఊరేగింపు చేపట్టి, బీసీ మహిళలపై అసభ్యకరంగా తనకు సానుకూలంగా ఉండే వ్యాఖ్యలను చేయడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నాళ్లిలా మౌనం దాల్చాలంటూ మహిళలు, యువత పెద్దల్ని ప్రశ్నించారు. దీంతో పెద్దలు సైతం ఇక మా వల్ల కాదంటూ పదండి రాజుల వద్దే తేల్చుకుందామని బయలు దేరారు. వందలాది మంది గ్రామస్తులు ఆటోలు, ట్రాక్టర్లపై కోటలోకి దండయాత్రలా వెళ్లారు. పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ మాకు న్యాయం చేయాలని గగ్గోలు పెట్టారు.
నానా గొడవ చేసినా..
మహిళలు, యువత ఏదో ఒకటి తేల్చాలంటూ నానా గొడవ చేశారు. గ్రామ పెద్దలు సావు కృష్ణమూర్తి, వజ్జి చిన్నారావు, బొబ్బాది తవిటినాయుడు, దమ్మా అప్పచ్చి తదితరులు బేబీ నాయనకు జరిగిన సంగతిని వివరించారు. మీ పేరు చెబుతుండడంతో మేం ఏం అనలేకపోతున్నామనీ, చివరకు కుటుంబాల్లో చిచ్చు పెడుతూ తన హవా సాగిస్తున్నాడనీ, ఇక భరించడం మా వల్ల కాదనీ చెప్పుకొచ్చారు. ఆయన్ని కోటలోకి రానివ్వమని ప్రకటించాలనీ, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకానొక దశలో గ్రామస్తుల అరుపులు, కేకలతో కోట దద్దరిల్లిపోయింది. చివరకు బేబీ నాయన మాట్లాడేందుకు ప్రయత్నించినా జనాల నిరసన గళాల మధ్య వీలు పడలేదు.
మీ మనోభావాలు దెబ్బతిన్న సంగతి తెలుసు..
చివరిగా బేబీ నాయన మాట్లాడారు. కాకల వెంకటరావు పేరు కూడా ఎత్తకుండా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని సంఘటనలు, సన్నివేశాల వల్ల మీ గ్రామ గౌరవం, ప్రతిష్ట దెబ్బతింది. మీ మనసులు గాయపడ్డాయి. పెద్దలు చెప్పగా తెల్సింది. కానీ ఇంత మందిలో న్యాయం చేయడం సరికాదు. గాబరాలో నిర్ణయాలు మంచివి కావు. ఒక ట్రెండు రోజుల్లో మీకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని అనడంతో ప్రజలు నిరుత్సాహం చెందారు. ఇంత చెప్పినా బేబీనాయన మా మాటలు మన్నించలేదు. మాకు న్యాయం జరుగలేదంటూ ఏఎస్పీ వద్దకు బయలు దేరి వెళ్లిపోయారు.
ఏఎస్పీ గౌతమీ శాలిని ఆశ్రయించిన మహిళలు..
మా కుటుంబ వ్యవస్థలను మంటగలిపేలా మాజీ కౌన్సిలర్ వ్యాఖ్యలు చేస్తున్నాడనీ, నాతో బీసీ మహిళలు తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించడంతో మా ఆత్మస్థైర్యం దెబ్బతిందని మహిళలు ఏఎస్పీ వద్ద తమ బాధలను చెప్పుకున్నారు. వందలాది మంది కోట నుంచి ఏఎస్పీ వద్దకు వెళ్లగా కొద్దిమంది మహిళలను మాత్రమే ఆమె అనుమతించి వారి నుంచి వివరాలు సేకరించారు. ఫిర్యాదు ఇమ్మన్నారు. కాకల వెంకటరావును పిలిపించి మైనర్ బాలిక వివాహంపై ప్రశ్నించారు. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పడంతో ఆమె ఆరా తీస్తున్నట్టు తెల్సింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేక గ్రామ పెద్దలు తన హత్యకు కుట్రపన్నారని కాకల వెంకటరావు పోలీసుల వద్ద అన్నట్టు తెల్సింది.
ఎదురు తిరిగిన జనం..
యువరాజు బేబీ నాయన వద్ద తమ కష్టాలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు ఎప్పుడూ ఆయన మాట వినేవారు. ఈ సారి ఆయన మాట్లాడుతుంటే అడ్డుతగిలారు. ఆయన మాటలు వారు ఊహించిన విధంగా న్యాయంగా లేకపోవడంతో మాకు హామీ ఇవ్వండి. కాకల వెంకటరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఏదో ఒకటి తేల్చాలంటూ ఎదురు తిరగడం విశేషం. ఎన్నడూ లేని ఈ ప్రజాగ్రహానికి కౌన్సిలర్ వెంకటరావు కారణమంటూ కోటలోని వర్గాలు కూడా వ్యాఖ్యానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment