రూ.13 కోట్లు గోల్‌మాల్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు నగరంలోని ఓ బ్యాంకు ఉద్యోగుల సొసైటీలో రూ.13కోట్లు గల్లంతైన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సొసైటీ ఫౌండర్ చైర్మన్ మాక్స్ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి, వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో డిపాజిట్ చేసిన వ్యక్తులు.. జరిగిన మోసంపై పోలీసు, సహకార శాఖకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొంతకాలంగా జరుగుతున్న విచారణలో డిపాజిట్ మొత్తాలు గల్లంతైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తిం చారు.
జిల్లాలోని బ్యాంకు ఉద్యోగులకు క్రెడిట్ సొసైటీ ద్వారా సేవలు అందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగి రామ్మోహనరావు ఫౌండర్ చైర్మన్‌గా పాలకవర్గ సభ్యులతో కూడిన సొసైటీని ఏర్పాటు చేశారు. బ్రాడీపేట 2/16లో సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సభ్యులకు సేవలు అందించేవారు. బ్యాంకు ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ క్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ పేరున ఏర్పాటైన ఈ సంస్థ బ్యాంకు ఉద్యోగులకు మాత్రమే సేవలు అందించాలి. ఇతర సభ్యులకు ఈ సొసైటీలో ప్రవేశం లేదు. అయితే 1995 మ్యాక్స్ చట్టానికి విరుద్ధంగా ఫౌండర్ చైర్మన్ గుంటూరు నగరంలోని కొందరు ప్రముఖుల నుంచి రూ.13 కోట్ల డిపాజిట్లు సేకరించారు.
ఆ మొత్తాలకు సంబంధించిన బాండ్లను డిపాజిట్‌దారులకు ఇచ్చారే కాని అదే మొత్తాలను సొసైటీ రికార్డుల్లో నమోదు చేయలేదు. కొంతకాలానికి ఫౌండర్ చైర్మన్ ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో డిపాజిట్‌దారులు సొసైటీలోని తమ డిపాజిట్లపై ఆరా తీశారు. తమకు ఇచ్చిన బ్యాండ్లపై ఉన్న మొత్తాల కంటే తక్కువ మొత్తాలు సొసైటీ రికార్డుల్లో నమోదు అయినట్టు తెలుసుకుని మిగిలిన పాలకవర్గ సభ్యులను ప్రశ్నించారు. ఆ మొత్తాలతో తమకు సంబంధం లేదని వారు స్పష్టం చేయడంతో డిపాజిట్‌దారులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది.
సమగ్ర విచారణ.. అయితే ఈ సొసైటీపై సమగ్రంగా విచారణ జరపాలంటే సహకారశాఖకు చెందిన అధికారుల సహకారం అవసరమని భావించి, కేసు వివరాలను రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్‌కు తెలియపరిచారు. దీనితో సొసైటీపై సమగ్ర విచారణకు జిల్లా సహకార శాఖ అధికారి (డీసీవో)ని ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో ఫౌండర్ చైర్మన్ సేకరించిన డిపాజిట్‌ల్లో ఎక్కువ మొత్తాలు సొసైటీ రికార్డుల్లో నమోదు కాలేదని, నమోదుకాని మొత్తాలు గల్లంతైనట్టుగా భావిస్తున్నామని జిల్లా సహకార శాఖ అధికారి పాండురంగారావు సాక్షి ప్రతినిధికి వివరించారు. ఈ కేసులో మిగిలిన పాలకవర్గ సభ్యులపై కూడా విచారణ చేపట్టనున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. సొసైటీలో నిధులు దుర్వినియోగానికి మొత్తం పాలకవర్గం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.