కాలం కొలిమిలో మరో ఏడాది కలిసిపోయింది. జ్ఞాపకాలు మిగులుస్తూ 2013 వీడలేక వీడ్కోలు తీసుకుంది. ఈ 365 రోజుల్లో ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు. కొన్ని ఘటనలు ఛాతీ ఉప్పొంగేలా చేస్తే, ఇంకొన్ని కంట నీరు పెట్టించాయి. ఈ పన్నెండు నెలలూ ఏదో ఒక విశిష్ట కార్యక్రమానికి జిల్లా వేదికగా మారింది. ఆ వివరాలు...
-న్యూస్‌లైన్, బొబ్బిలి
జనవరి
ఈ నెలలో ఇరవయ్యే తేదీ నుంచి జరిగిన నంది నాటకోత్సవాలు జిల్లా వాసులను అలరించాయి. అలాగే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కొత్త ఉత్తేజం వచ్చింది. ఈ నెల ఐదో తేదీన వైఎస్‌ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా సుజయ్‌కృష్ణ రంగారావు బాధ్యతలు స్వీకరించారు. అలాగే శంబర సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. మొదటి సహకార ఎన్నికలకూ ఇదే నెల వేదికైంది.
ఫిబ్రవరి
ఈ నెలలో పదిహేనో తేదీన బొబ్బిలి మం డలం కలువరాయిలో బాణసంచా పేలుడు సంఘటన జిల్లా వాసులను ఉలిక్కిపడేలా చేసింది. అలాగే పదిహేడో తారీఖున బొబ్బిలిలో ఓ మానసిక వికలాంగురాలు మృగాళ్ల దాడికి బలైంది. రామతీర్థంలో వెంకన్న కల్యాణం వైభవంగా జరిగింది. అయితే రథయాత్రలో రథం ఇరుసు విరిగి విమర్శలూ వచ్చాయి. జిల్లాలో వస్త్ర దుకాణాల బంద్ కూడా నిర్వహించారు.
మార్చి
ఈ నెల ఒకటో తేదీన రామతీర్థంలో పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో లక్షదీపారాధన నిర్వహించారు. అలాగే పదో తేదీన హాస్యనటుడు బ్రహ్మానందానికి పురస్కారం అందించారు. జిల్లా కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యుత్ మహాధర్నాకు మంచి స్పందన లభించింది. అప్పటి కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రభుత్వ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఇరవై ఒకటో తేదీన నెల్లిమర్ల నగర పంచాయతీగా మార్పు చెందింది. గరివిడి, బాడంగిలలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
మే
ఈ నెల పదిహేనో తేదీన రామతీర్థంలో ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. విజయనగరంలో గర్భిణిని సజీవంగా దహనం చేశారు. 27వ తేదీన గుర్ల మండలంలో ప్రమాదం సంభవించి 48 ఇళ్లు కాలిపోయాయి. కొమరాడలో మావోయిస్టుల డంప్ దొరికింది. ఈ నెలంతా జిల్లా వాసులకు నష్టాల ఘటనలే పలకరించాయి.
ఏప్రిల్
వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలపై ఆందోళన నిర్వహించారు. గజపతినగరంలో పదహారో తే దీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అమ్మహస్తం పథకం ప్రారంభించారు. ఐదో తేదీన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిణి జిల్లాలో పర్యటించారు. బొబ్బిలిలో వేణుగోపాల స్వామి తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు.
జూన్
ఈ నెల పదహారో తేదీన జిల్లా కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటించారు. అలాగే 18వ తేదీన కాంతిలాల్ దండే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎనిమిదో తేదీన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావుపై అనర్హత వేటు పడింది. ఇరవైన విజయనగంలో ఖాదర్ వలీ బాబా 54వ చందనోత్సవం జరిగింది.
జూలై
ఆరో తేదీన మహానేత తనయ వైఎస్ షర్మిల జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించా రు. 23, 27 తేదీల్లో పంచాయతీ తొలి, మలి విడత ఎన్నికలు జరిగాయి. ముపై్పవ తేదీన భోగాపురం మండలం చినకొండరాజు పాలెంలో 150 ఇళ్లు దగ్ధమయ్యాయి. 29వ తేదీన పూసపాటిరేగ మండలం చినకొండరాజు పాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఆగస్టు
ఈ నెల 23వ తేదీన విజయనగరంలో పదివేల మందితో మా తెలుగుతల్లి గీతాన్ని ఆలపించా రు. ఏడో తేదీన మంత్రి బొత్స ఇంటిని ముట్టడించారు. అలాగే 28వ తేదీన ఐటీడీఏ పీఓగా రంజిత్ కుమార్ షైనీ, సబ్ కలెక్టర్‌గా శ్వేతా మహంతి నియమితులయ్యారు. 24వ తేదీన రామతీర్థంలో రాముని పట్టాభిషేకం వైభవంగా జరిగింది. 30న విజయనగరంలో లక్షజన గర్జన దద్దరిల్లిపోయింది.
సెప్టెంబర్
ఈ నెల 26వ తేదీన ఉగ్రవాదుల చేతిలో మెంటాడ మండల వాసి మృతి చెం దారు. పదో తేదీన గుమ్మలక్ష్మీపురంలో డంప్ స్వాధీనం చేసుకున్నారు. 26వ తేదీన ఏసీబీ వలలో భోగాపురం ఎంఈఓ చిక్కారు. 19వ తేదీన డెంకాడ మండలం చంపావతి వద్ద నదిలో పడి ఇద్దరు మృతి చెందడం జిల్లా వాసులను కలవరపరిచింది.
అక్టోబర్
సమైక్యాంధ్రకు మద్దతుగా రెండో తేదీన నియోజకవర్గ కేం ద్రాల్లో వైఎస్‌ఆర్ సీపీ దీక్షలు ప్రారంభం. నాలుగో తేదీన జిల్లా కేంద్రంలో ఉవ్వెత్తున సమైక్య సెగ ఎగసి పడింది. ఐదో తేదీన జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ పెట్టారు. 22వ తేదీన కర్ఫ్యూలోనే పైడితల్లి సిరిమానోత్సవం జరిగింది. 27వ తేదీన నెలిమర్ల, చీపురుపల్లిలో చంద్రబాబు పర్యటించారు. 27న ఎస్పీ కార్తికేయకు బదిలీ అయింది. 30వ తేదీన వైఎస్ విజయమ్మ పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో పంట నష్టాలు పరిశీలించారు.
నవంబర్
ఈ నెల మూడో తేదీన గొట్లాం వద్ద విజయవాడ పాసింజర్ ఢీకొని ఎనిమి ది మంది మృతి చెందారు. ఐదో తేదీన గజపతినగ రం మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు మృ తి చెందారు. పదకొండో తేదీన భోగాపురం మండలం ముక్కాం లో 19 ఇళ్లు దగ్ధమయ్యాయి. 14న గుర్ల మండలం చంపావతి నదిలో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన విషా దం నింపింది. 21న బొండపల్లి మండలం రయింద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 28 ఇళ్లు కాలిపోయాయి. 30న మొదలి నాగభూషణ శర్మకు గురుజాడ విశిష్ట పురస్కారం అందించారు.
డిసెంబర్
ఆరో తేదీన సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ నిర్వహించారు. 17వ తేదీన డుమా పీడీగా గోవిందరాజులు నియమితులయ్యారు. 20న నెల్లిమర్ల ఎస్‌టీఓ, సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ వలకు చిక్కారు. 28న డెంకాడ మండలం చింతలవలస వద్ద బడ్డీలోనికి లారీ దూసుకు వెళ్లి ఐదుగురు దుర్మరణం చెందారు.