కడప రూరల్: టీడీపీ పాలనలో గాడి తప్పిన 104 సంచార చికిత్స వైద్య విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 22 సంచార చికిత్స వాహనాలు ఉన్నాయి. వీటికి కండీషన్ జబ్బు పట్టుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాటిని బాగు చేసి గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా అడుగులు వేశారు.
సంచార వైద్యం ఇలా..
జిల్లా వ్యాప్తంగా 22 సంచార వాహనాలు ఉన్నాయి. ఇందులో ప్రతి వాహనానికి వైద్యుడు, నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్‌తో ఐదు మంది సిబ్బంది ఉంటారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచనల (రోడ్ మ్యాప్) ప్రకారం ఈ వాహనాలు నిర్ధేశించిన గ్రామాలకు వెళ్లాల్సి ఉంది. ఉదాహరణకు ఒక నెలలో మొదటి వారంలో ఒక గ్రామానికి వెళితే, మరుసటి నెలలో అదే రోజు అదే గ్రామానికి ఈ సంచార వాహనం వెళ్లాలి. ఆ మేరకు వైద్యం కోసం ఒక వాహనం వద్దకు రోజుకు దాదాపు 100 మంది రోగులు (ఔట్ పేషెంట్స్) వస్తారు. ఇక్కడికి వచ్చే గ్రామీణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ) ఎలాంటి వైద్య సేవలు లభిస్తాయో.. దాదాపు అన్నీ ఈ 104 సంచార వాహనం ద్వారా లభించాల్సి ఉంది.
గతంలో అన్నింటికీ కొరతే..
దాదాపుగా నిర్ధేశించిన గ్రామానికి ఒక వాహనం నెలకు ఒక సారి వెళితే.. అక్కడికి వచ్చే రోగులకు నెలకు సరిపడా మందులను ఇవ్వాలి. అయితే ప్రతి నెలా ఏదొక మందు కొరత ఉండేది. ప్రధాన గ్రామీణ ప్రాంతాల వారికి జ్వరాలు, ఒళ్లు నొప్పులు, బీపీ, ఘగర్ వ్యాధులతో బాధపడుతుంటారు. అంతేకాక కూలి పనులకు వెళతారు కాబట్టి గాయాలవుతుంటాయి. వీరికి 104 వైద్య సేవలు అందాలి. మందులు, పరికారాల కొరత వేధిస్తోంది. దీంతో 104 సిబ్బంది చేసేది లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న మందులను ఇ స్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో గ్రామీణులకు పూర్తిస్థాయిలో చికిత్స అందక పట్టణం బాట పడుతున్నారు. ఈ వాహనంలో రక్త, మల, మూత్ర ప రీక్షలతో పాటు కాస్త పెద్ద వ్యాధులను కూడా నిర్ధారించాలి. అయితే చాలా వాహనాల్లో పరికరాల కొరతతో అది వీలుకావడంలేదు. పలు వాహనాల్లో ఈసీజీ పరికరాలు పని చేయడంలేదు.
ఎఫ్‌సీ, ఇన్సూరెన్స్‌కు నోచని వైనం..
ప్రతి వాహనానికైనా ఎఫ్‌సీ (ఫిట్‌నెస్ సర్టిఫికెట్), ఇన్సూరెన్స్ సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. అయితే 104 వాహనాల్లో చాలా వాటికి ఆ సౌర్యం లేకపోవడం గమనార్హం. దాదాపుగా 2008 నుంచి ఉన్న వాహనాలనే నడుపుతున్నారు. అలాగే మొత్తం 22 వాహనాలకు గానూ సగం వాటికి టైర్లు అరిగిపోయాయి. అయినా అలాగే నడిపేస్తున్నారు. దీంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. ఇలాంటి సమస్యలతో 104 వాహనం సకాలంలో గ్రామాలకు వెళ్లలేని పరిస్ధితి.
సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి..
గ్రామీణుల చెంతకే వెళ్లి వైద్య సేవలు అందించే 104 సంచార వాహన వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని వాహనాలు కండీషన్‌లో ఉండాలని.. మందులకు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో మరో కొద్ది నెలల్లోనే 104 సంచార చికిత్స విధానం గాడిలో పడనుందని వైద్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
2008 నుంచి 104 వైద్య సేవలు..
గ్రామీణుల చెంతకే వైద్య సేవలు వెళ్లాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంకల్పించారు. ఆ మేరకు 2008 ఆగష్టులో 104 సంచార వైద్య సేవలను ఆయన ప్రారంభించారు. నాటి నుంచి గ్రామీణుల చెంతకే వైద్య సేవలు వెళ్లేవి. అనంతరం అధికారంలోకి చంద్రబాబు ఆ బాధ్యతలను 2016లో పెరమిల్ స్వాశ్య మేనేజ్‌మెంట్ రీసెర్స్ ఇన్‌స్టిట్యూట్ (పీఎస్‌ఎంఆర్‌ఐ)కు అప్పగించారు. దీనికి చంద్రన్న 104 సంచార చికిత్సగా నామకరణం చేశారు. అయినప్పటికీ గ్రామీణులకు సక్రమంగా వైద్యం అందకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment