మిల్లర్లకు తీపి కబురు
తాడేపల్లిగూడెం : లెవీ రూపంలో మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే విషయంలో నెలకొన్న మీమాంస తొలగిపోయింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) కుదింపు ఉండబోదని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ లెవీ సేకరణను యథాతథంగా జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన ప్రభావం లెవీపై ఉంటుందని, కేఎం ఎస్‌ను కుదిస్తారని ఎఫ్‌సీఐ అధికారులు తొలుత భావించారు. జూన్ 30వ తేదీతో సేకరణను అర్ధాంతరంగా నిలిపివేస్తారని మిల్లర్లు భయపడ్డారు. గడువు కుదింపు లేదని ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ విషయంపై ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ కేవీ రాజును సంప్రదించగా.. గడువు కుదింపు లేద ని, గడువు పూర్తయ్యేవరకు మిల్లర్ల నుంచి బియ్యం సేకరిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన ప్రభావం ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌పై ఉండదన్నారు.
జాగా బాగుంది
లెవీ కింద జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం వెళుతున్నారుు. ఎఫ్‌సీఐ నుంచి పౌర పంపిణీ నిమిత్తం ఇతర ప్రాంతాలకు సైతం తరలిస్తున్నారు. జిల్లాలోని గోదాముల్లో జాగా కూడా బాగా ఉండటంతో పూర్తిస్థారుులో బియ్యం సేకరణకు అవకాశం ఉంది. నెలకు 6 చొప్పున స్పెషల్స్ ర్యాక్స్‌ను రైల్వే శాఖ కేటాయిస్తుండటంతో రవాణా సమస్య కూడా తీరింది. ఫలితంగా బియ్యం సేకరణ వేగం పుంజుకుంది. జిల్లాలో లెవీ సేకరణ లక్ష్యం 11 లక్షల 75 వేల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటివరకు 8 లక్షల 14 వేల మెట్రిక్ టన్నులుసేకరించారు. వీటిలో 7 లక్షల 85 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 28 వేల 500 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం ఉన్నాయి.