సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? చంద్రగిరిలో పోలింగ్ వీడియోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఎన్నికల్లో కొందరు సిబ్బంది కుమ్మక్కైతే ఎన్నికల సంఘం చూస్తూ కూర్చోవాలా?’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వివేది శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తొలుత చంద్రగిరిలో ఎన్నికలు సవ్యంగా జరిగినట్లు నివేదికలు వచ్చాయని, కానీ రీ–పోలింగ్ కోరుతూ అందిన ఫిర్యాదులపై వీడియోలను పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా? అనిపించేలా దారుణమైన పరిస్థితులు కనిపించాయని వెల్లడించారు. అన్ని ఫుటేజ్‌లు పరిశీలించిన తర్వాతే రీ–పోలింగ్‌కు సూచిస్తూ ఈసీకి సిఫార్సు చేశామని స్పష్టం చేశారు. చంద్రగిరిలో ఏం జరిగిందన్న విషయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. చంద్రగిరిలో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించడంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను న్యాయస్థానానికే సమర్పిస్తామని ద్వివేది ప్రకటించారు.
వీడియో ఫుటేజ్‌లు చూశాక మాట్లాడాలి..
ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలను దాచిపెట్టాలనో లేక ఎవరినో కాపాడాలనో తాము చూడటం లేదని ద్వివేది పేర్కొన్నారు. రీ పోలింగ్‌పై ఆరోపణలు చేస్తున్నవారు ఒకసారి ఈ వీడియో ఫుటేజ్‌లు చూసి మాట్లాడాలన్నారు. చంద్రగిరిలో ఎన్నికల సమయంలో తప్పు జరగడం వల్లే ఈసీ స్పందించిందని, ఫిర్యాదు ఆలస్యంగా అందడం వల్లే ఒకేసారి రీ–పోలింగ్ నిర్వహించలేక పోయామని వివరించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందని, ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించం: టీడీపీ రీ–పోలింగ్ కోరుతున్న 18 చోట్ల కూడా వీడియో ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు ద్వివేది తెలిపారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టేది లేదని, చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో పీవో, ఏపీవోలపై కఠిన చర్యలుంటాయన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అనధికారిక వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామన్నారు.
మరో రెండు చోట్ల రీ–పోలింగ్‌కు సిఫార్సు
చిత్తూరు జిల్లాలోని మరో రెండు పోలింగ్ కేంద్రాల్లో కూడా కలెక్టర్ రీ పోలింగ్‌కు సిఫార్సు చేసినట్లు ద్వివేది తెలిపారు. వీడియో ఫుటేజ్ పరిశీలించిన తర్వాత 310, 323 కేంద్రాలలో రీ పోలింగ్‌కి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఈసీ అనుమతి కోరుతూ నివేదిక పంపినట్లు చెప్పారు.
రేపు చంద్రగిరిలో రీ పోలింగ్‌కు పటిష్ట భద్రత
చంద్రగిరిలో ఆదివారం రీ పోలింగ్ నిర్వహించే ఐదు కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ద్వివేది ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 250 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ద్వివేది నియమావళిని వివరించారు. ఎన్నికల విధులకు సంబంధించి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. రీ పోలింగ్ సందర్భంగా ఓటరు ఎడమ చేయి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలన్నారు. ఎండల నేపథ్యంలో ఇబ్బంది లేకుండా షామియానాలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.
ఇది ప్రజాస్వామ్యమేనా?
Published Sat, May 18 2019 3:20 AM | Last Updated on Sat, May 18 2019 4:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment