
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఒకటి రెండు చోట్ల పోలీసులు ప్రచారాన్ని ఆపారని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉండరాదని.. బయట వ్యక్తులు వాళ్ల ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని.. నగదు, మద్యం, కానుకల స్వాధీనంలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. రాజకీయ పార్టీలు ఈ రెండు రోజులు సహకరించాలని కోరారు. ప్రలోభాలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికారాలు నిషేధం కావున.. సెల్‌ఫోన్‌లు తీసుకుని రావద్దని విజ్ఞప్తి చేశారు.
‘ఓటుకి డబ్బులు తీసుకున్నవారు కూడా శిక్షార్హులే. తమకు వస్తున్న ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. సీ విజిల్ యాప్ ద్వారా 5679 ఫిర్యాదులు అందాయి. అందులో నిజమైన వాటిపై విచారణ జరిపాం. చాలా మట్టుకు తప్పుడు ఫిర్యాదులు వచ్చాయి. బుధవారం సాయంత్రానికల్లా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరకుంటారు. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమౌతోంది. వికలాంగులకు, అంధులకు ఓటు హక్కు వినియోగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో 81,000 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. ఈ సారి మై ఓట్ క్యూ యాప్ ప్రారంభించాం. ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం వద్ద క్యూ ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఇప్పటికే 21,000 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.. దానిని పోలింగ్ తేదీ నాటి లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఓటరు కార్డు లేని వారు పదకొండు రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు. రెండోసారి ఓటు వేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష తప్పద’ని ద్వివేదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment