కొత్త ఇసుక పాలసీ.. | The Government Announced New Sand Policy Implemented Soon | Sakshi
Sakshi News home page

కొత్త ఇసుక పాలసీ..

Published Wed, Sep 4 2019 8:45 AM | Last Updated on Wed, Sep 4 2019 8:45 AM

The Government Announced New Sand Policy Implemented Soon - Sakshi

ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపక్కన ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్‌ పాయింట్‌   

ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇసుక పాలసీ గురువారం నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో ఇప్పటికే ఆరు స్టాక్‌పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇసుకను వినియోగదారులకు సులభంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇసుకను స్టాక్‌పాయింట్లకు తరలిస్తున్నారు. దీని కోసం రవాణా ధరలు కూడా నిర్ణయించారు. 

సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఇసుక అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బుధవారం క్యాబినెట్‌ సమావేశం తర్వాత దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయనున్నదని ఆయన వెల్లడించారు. గోదావరి ర్యాంపుల నుంచి ఇసుకను బయటకు తీసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా జిల్లాలో వేర్వేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఆరు స్టాక్‌ పాయింట్లకు తరలిస్తారు. పోలవరం, తాళ్లపూడి మండలం బల్లిపాడు, కొవ్వూరు మండలం కాపవరం, ఏలూరు నగరం, కరుగోరుమిల్లి, చించినాడ సమీపంలోని ఇలపర్రులో స్టాక్‌పాయింట్లు ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంతాలకు ఇప్పటికే ఇసుకను తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రస్తుతం జిల్లాలో మూడు రకాల ఇసుక అందుబాటులో ఉంది. ఒకటి ఓపెన్‌ రీచ్‌ల ద్వారా, రెండు బోట్ల ద్వారా డీసిల్టింగ్‌ చేయడం, మూడు రైతుల పొలాల్లో మేట వేసిన ఇసుకను తవ్వడం. అయితే ప్రస్తుతం గోదావరి వరద కారణంగా ఓపెన్‌ రీచ్‌లు, రైతుల పొలాల్లో నీరు ఉండటం వల్ల  తవ్విన ఇసుక అందుబాటులో లేదు. పడవల్లో డీసిల్టింగ్‌ చేసిన ఇసుక మాత్రమే అందుబాటులో ఉంది. ఇలాంటివి జిల్లాలో 15 రీచ్‌లు ఉండగా, 11 రీచ్‌లు పనిచేస్తున్నాయి.

వినియోగదారులకు అందేదిలా..
బోట్లలో నుంచి తీసుకువచ్చిన ఇసుకను ముందుగానే ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా స్టాక్‌ పాయింట్లకు తరలిస్తారు. కొత్త పాలసీ వచ్చిన తర్వాత విధివిధానాలు వస్తాయి. మీసేవా ద్వారా, లేకపోతే వెబ్‌సైట్‌ ద్వారా ఇసుక బుక్‌ చేసుకోవచ్చు. బుకింగ్‌ చేసిన తర్వాత సరఫరా చేస్తారు.ఎవరైనా ఇసుక తమ వాహనాల్లో ఇసుక తీసుకువెళ్తామంటే ఆ విధంగా కూడా అనుమతిస్తారు. లేనిపక్షంలో ప్రభుత్వం రిజిస్టర్‌ చేసిన వాహనాల ద్వారా ఇసుకను పంపిస్తారు. ఇసుక తవ్వకాలు, రవాణాలో ఎటువంటి అక్రమాలూ జరగకుండా  అన్ని రీచ్‌లు, స్టాక్‌ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్‌ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా జీపీఎస్‌ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించనుంది. జీపీఎస్‌ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్‌ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 250 వాహనాలను యజమానులు ఇసుక తరలించేందుకు రిజిస్టర్‌  చేయించుకున్నారు. 

రవాణాకు ధర నిర్ధారణ 
ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90  ధర నిర్ణయించారు.15 కిలోమీటర్లలోపు ఉంటే ఈ ధర గిట్టుబాటు కానందున దాని కోసం వేరే ధర నిర్ణయించనున్నారు. 15 కిలోమీటర్లు దాటిన  ప్రాంతాలకు ఈ ధరనే నిర్ణయిస్తారు. స్టాక్‌ యార్డు నుంచి దూరాన్ని బట్టి రేటు ఉంటుంది. అన్ని స్టాక్‌ యార్డుల వద్ద టన్ను ఇసుక రూ.375కే సరఫరా చేస్తారు. అయితే ఏలూరు స్టాక్‌ యార్డు రేటులో మాత్రం ధర తేడా ఉంటుంది. రూ.375 తో పాటు గోదావరి నుంచి ఏలూరుకు సుమారు 85 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వరకూ రవాణాకు అయిన వ్యయాన్ని కూడా వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement