కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు నయాపైసా విదల్చలేదు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపల్ ప్రాంతాల్లో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు రుణాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఆయా వర్గాలకు చెందిన నిరుద్యోగులు లక్ష్యానికి మించి దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ కార్పొరేషన్లకు బడ్జెట్ విడుదలవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెల గడచిపోతున్నా ఆ ఊసే కరువైంది.
ఫలితంగా దరఖాస్తుదారులు కార్పొరేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు వార్షిక రుణ ప్రణాళికలను ఉన్నతాధికారులకు పంపినా నేటికీ అతీగతీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధికి 2013-14 ఆర్థిక సంవత్సరానికి 5,153 మంది ఎస్సీలకు రూ.43 కోట్ల రుణాలను అందించాలని రూపొందించిన వార్షిక ప్రణాళికను ఆమోదం కోసం ఉన్నతాధికారులకు పంపారు. బ్యాంక్ లింకేజీ ద్వారా గ్రామీణ, పట్ణణ ప్రాంతాల్లోని ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు రూ.17.50 కోట్లతో ప్రతిపాదించారు. అలాగే సాగునీరు, చిన్నతరహా పరిశ్రమలు, బోరు బావులు, విద్యుత్ మోటార్లకు సంబంధించి 649 మంది లబ్ధిదారులకు రూ. 3.85 కోట్లు, పశువుల పెంపకం, గొర్రెల యూనిట్లను నెలకొల్పే నిమిత్తం 385 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేందుకు రూ.3.42 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు.
జిల్లాలోని భూమి లేని నిరుపేద ఎస్సీలను గుర్తించి ఒక్కొక్కరికి ఎకరా భూమి కొనుగోలు చేసిచ్చేందుకు ఏర్పాటైన భూమి కొనుగోలు పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 100 మంది లబ్ధిదారులకు రూ.5 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాలతో లబ్ధి పొందేలా 1106 మందికి రూ.8.96 కోట్లు రుణంగా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. సఫాయి కర్మచారి, జోగిని పునరావాసం, విడుదలైన ఖైదీలు, లొంగిపోయిన నక్సలైట్లు, బీడీ కార్మికులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు దాదాపు 235 మందికి రూ.2.30 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆమోదం లభించలేదు.
అదేవిధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు రూ.26 కోట్లతో వార్షిక ప్రణాళికను తయారుచేసి ప్రభుత్వానికి పంపినా ఇప్పటికీ ఫలితం లేకపోయింది. బీసీ కార్పొరేషన్‌కు కూడా ఇప్పటి వరకు నయాపైసా విడుదల చేయకపోవడం నిరాశ కలిగిస్తోంది. అయినప్పటికీ ఆయా వర్గాలకు చెందిన ప్రజలు ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు.
బడ్జెట్ నిల్
Published Mon, Dec 30 2013 3:10 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement