సపోర్టు లేదాయె..!
అమ్మాయి పెళ్లికి భూమి విక్రయిద్దామంటే వీలు పడదు. కొడుకు చదువుకు కాసింత స్థలాన్ని కుదవ పెట్టడానికీ కుదరదు. సొంత భూమే అయినా క్రయవిక్రయాలకు హక్కు లేదు. భావనపాడు ప్రతిపాదిత పోర్టు పరిధిలోని పలు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులివి. వంశపారంపర్య జాగాలను కూడా విక్రయించలేని స్థితికి సర్కారు తమను దిగజార్చిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కులను హరించేసి వెక్కిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ అంశంలో చేయాల్సిన సవరణలు ఇంకా చేయకుండా తాత్సారం చేస్తూ చోద్యం చూస్తోందని ఆరోపిస్తున్నారు.
టెక్కలి: సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో తలపెట్టిన పోర్టు నిర్మాణంలో మత్స్యకారులకు ప్రభుత్వం సపోర్టు ఇవ్వడం లేదు. వీరికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీలు కానరావడం లేదు. పోర్టు నిర్మాణం కోసం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసిమూడేళ్లవుతోంది. రెండు పర్యాయాలు పోర్టు అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో భా వనపాడు తీరాన్ని పరిశీలించారు తప్ప పోర్టు వల్ల భూములు కోల్పోతున్న బాధితులకు మా త్రం భరోసా కలిగించే విధంగా స్పష్టమైన హామీలు ఇవ్వలేకపోతున్నారు. మొదట 4708 ఎకరాల్లో భూ సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్ తర్వాత 2050 ఎకరాలకు కుదించారు. అయితే నోటిఫికేషన్‌లో మిగులు భూములను తొలగించకపోవడంతో పోర్టుకు అవసరం లేని మిగులు భూముల క్రయవిక్రయాలకు ఆటంకా లు ఎదురవుతున్నాయి.
మొదటి నోటిఫికేషన్
భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణం కోసం 2015 ఆగష్టు 28న సుమారు 4708 ఎకరాల భూ సేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భావనపాడు, మర్రి పాడు, దేవునల్తాడ, పొల్లాడ, సూర్యమణిపురం, కొమరల్తాడ తదితర గ్రామాలను చేర్చారు. అప్పట్లో భూ సేకరణ కోసం అధికారులు గ్రా మాల్లోకి వెళ్లగా ప్రభావిత గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత 2274 ఎకరాల భూసేకరణకు సిద్ధమయ్యారు. అయినా వ్యతిరేకత తగ్గలేదు. చివరగా భావనపాడు, కొమరల్తాడ, తామాడపేట, దేవునల్తాడ, సీతా నగరం గ్రామాల్లో మాత్రమే 2050 ఎకరాల్లో భూ సేకరణ చేసేందుకు ప్రభుత్వం తుది ని ర్ణయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్‌లో ముందు పేర్కొన్న భూములను తొలగించలేదు.
హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
పోర్టు నిర్మాణం వల్ల నష్టం వాటిల్లుతుందని తక్షణమే పోర్టు నిర్మాణం నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని భావనపాడు నుంచి 372 మంది, తామాడపేట, కొమరల్తాడ నుంచి 196 మంది, దేవునల్తాడ నుంచి 129 మంది, సీతానగరం నుంచి 16 మంది చొప్పున హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీతానగరం నుంచి రిట్ పిటిషన్ వేసిన 16 మంది విత్ డ్రా కాగా మిగిలిన గ్రామ ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు.
హామీలు లేవు
భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణం విషయంలో బాధితులకు స్పష్టమైన హామీలను పక్కన పెట్టి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పోర్టు నిర్మాణం కోసం అనుమతులు దక్కించుకున్న అదాని సంస్థతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు ఆదాయంలో 2.3 శాతం ఆ దాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు అదాని సంస్థ అంగీకరించడంతో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
హడావుడేనా..?
భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణం విషయమై పోర్టు అధికారులు రెండు పర్యాయాలు భావనపాడు గ్రామాన్ని పరిశీలించారు. రెండు రోజుల కిందట పోర్టు డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు భావనపాడు గ్రామానికి వెళ్లగా అక్కడ మత్స్యకారులు అధికారులపై ప్రశ్నలు వర్షం కురిపించారు. పోర్టుకు అవసరం లేని భూములు నోటిఫికేషన్ ఆధీనంలో ఉండడం వల్ల వివిధ అవసరాలకు భూముల క్రయవిక్రయాలు జరగడం లేదని అంతే కాకుండా స్పష్టమైన హామీలు ఇవ్వకుండా హడావుడి చేస్తున్నారని మత్స్యకారులు అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించబోమని అంతే కాకుండా పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్థానికులంటున్నారు.