క్రీడాభివృద్ధిలో సర్కారు విఫలం: రోజా
► ఒక మైదానమూ లేదు
► క్రీడలకు ప్రోత్సాహంలో చెవిరెడ్డి ఆదర్శం
► ఎమ్మెల్యే రోజా వెల్లడి
తిరుపతి సెంట్రల్: తాను, తన ప్రభుత్వం గొప్ప అంటూ ప్రగల్బాలు పలుకుతున్న సీఎం చంద్రబాబు హయాంలో ఒక క్రీడాకారుడినైనా సిద్ధం చేశారా? అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో క్రీడాభివృద్ధికి తూట్లు పడ్డాయన్నారు. తుమ్మలగుంటలో జరుగుతున్న వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే రోజా శుక్రవారం సందర్శించారు. పది క్రీడామైదానాల్లోని క్రీడాకారులను కలుస్తూ, వారిని ఉత్సాహపరిచేలా కాసేపు క్రికెట్ ఆడారు.
అనంతరం విలేకరుల సమావేశంలో రోజా మాట్లాడుతూ గ్రామంలోని యువత పక్కదారి పట్టకుండా, క్రీడలవైపు వారిని మళ్లించి, ప్రోత్సహిం చాల్సిన ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. గ్రామాల్లో ప్రతిభగల యువతకు కొదవలేకున్నా వారిని వెన్ను తట్టి ప్రోత్సహించలేక పోవడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నా రు. మూడేళ్లలో ఒక్క క్రీడామైదానాన్ని, ఒక స్పోర్ట్స్ అకాడమీని నిర్మించలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వం ఉందన్నారు.
క్రీడాభివృద్ధికి మూడేళ్లలో ఒక్క పైసా నిధులు ఖర్చు పెట్టని పరిస్థితిలో 2019లో రాష్ట్రంలో ప్రతిష్టాత్మంగా ఒలంపిక్స్ క్రీడలను నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు చేయలేని పని, ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసి చూపిస్తున్నారని కొనియాడారు. చెవిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు విద్యకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ, రాజకీయాల్లోనూ రాణించేలా ఎదగాలని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.