అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :‘అనంత’లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాష్ర్ట ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జూలై 30న రాష్ర్ట విభజనకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. అదే నెల 31న నగరంలో విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అప్పటి నుంచి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాలనకు సంబంధించి జిల్లా అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. డివిజన్‌ల వారీగా ఎంత మంది ఉద్యోగులు విధులకు హాజరయ్యారు? మండల, తహశీల్దార్ కార్యాలయాల్లో ఎంత మంది హాజరయ్యారు? కార్యాలయాల్లో విధ్వంసకర సంఘటనలు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా? తదితర వివరాలను ఆరా తీస్తోంది. పాలన వ్యవహారాలకు సంబంధించి ఆయా డివిజన్‌లలో ఆర్డీఓల ద్వారా కలెక్టరేట్ అధికారులు నివేదికలు తెప్పించుకుని ప్రభుత్వానికి పంపుతున్నారు. రెవెన్యూ పాలనకు సంబంధించిన వివరాలను మాత్రమే తాము ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
స్తంభించిన పాలన
జిల్లాలో గత 9 రోజులుగా పాలన స్తంభించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అనంతరం నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని చోట్ల మాత్రమే తెరచుకున్నాయి. కార్యాలయాలు తెరచుకున్నా ఉద్యోగులు 72 గంటల పాటు విధులు బహిష్కరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 25వేల మంది ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. గురువారం కూడా అరకొరగానే ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకున్నాయి. నగరంలో ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం బ్యాంకు మినహా మరే బ్యాంకు తలుపులూ తెరుచుకోలేదు. వీటితో పాటు పలు ప్రైవేట్ బ్యాంకులు, సంస్థలు కూడా నేటికీ ప్రారంభం కాలేదు.
చనిపోయిన వారి వివరాల సేకరణలో వైఫల్యం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున పిట్టల్లా రాలుతున్నారు. దాదాపు 20 మంది పైబడి సమైక్యాంధ్ర కోసం చనిపోయారు. అయితే ఇప్పటిదాకా ఒకరు మాత్రమే సమైక్యాంధ్ర కోసం చనిపోయారని నివేదిక అందినట్లు ఆ విభాగం పర్యవేక్షిస్తున్న ఓ అధికారిణి పేర్కొన్నారు.