సాక్షి, విశాఖపట్నం: పెందుర్తి మండలం చీమలాపల్లి సర్వే నంబరు 23లో ప్రభుత్వ భూమి ఉంది. అందులో స్థానిక టీడీపీ నాయకుడు దాదాపు వెయ్యి గజాల ప్రభుత్వ (కొంత భాగం సింహాచలం దేవస్థానం పరిధి కూడా ఉంది) స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకోసం మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణమూర్తిలతో దిగిన ఫొటోలను ఆయా స్థలంలో ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేశాడు. రూ.2 కోట్లు విలువైన ఈ స్థలంలో చిన్నపాటి బడ్డీలు, షెడ్‌లు నిర్మించేస్తున్నాడు.
పక్కా ‘పచ్చ’ స్కెచ్
ఆ నాయకుడు జీవీఎంసీ అధికారులను ‘మేనేజ్’ చేసి ఇంటిపన్ను, ఇతర పన్నులు సంపాదించాడు. వీటిని ఆసరాగా చేసుకుని ఇటీవల 296 జీవో ద్వారా క్రమబద్దీకరణకు దరఖాస్తులు చేయగా అధికారులు తిరస్కరించారు. దీంతో తాజాగా సదరు షెడ్ల ముందు టీడీపీ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు పెట్టి ఎలాగైనా దాన్ని కొట్టేయడానికి స్కెచ్ వేశాడు. మరోవైపు ఇక్కడ కబ్జా జరుగుతున్న విషయం రెవెన్యూ అధికారులకు తెలుసు. కానీ అధికారపార్టీ నాయకుడు కావడంతో ఈ ఆక్రమణపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా కింది స్థాయి రెవెన్యూ అధికారులు వెళ్లి ఓ షెడ్‌ను తొలగించినా రాత్రికి రాత్రే మళ్లీ దాన్ని నిర్మించేశాడు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆక్రమణలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
సర్వే నెంబర్ 23 ప్రభుత్వభూమి. ఇందులో ఆక్రమణలను సహించం. ఇక్కడ ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. ఆక్రమణలు ఉంటే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.
– రవికృష్ణ,
రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, పెందుర్తి
Comments
Please login to add a commentAdd a comment