మార్కాపురం, న్యూస్‌లైన్: ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలన్న ప్రభుత్వ సంకల్పం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ విజయకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టినా..ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. నిధులున్నా లబ్ధిదారులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వివిధ మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది.
ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకునే మరుగుదొడ్డికి రూ 10,200 ఖర్చవుతుందని అంచనా. కేంద్రం రూ 4,800, రాష్ట్ర ప్రభుత్వం రూ 4,500, లబ్ధిదారుని వాటా రూ 900గా నిర్ణయించారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు ఉంటే నగదును ప్రభుత్వం దశల వారీగా లబ్ధిదారునికి అందజేస్తుంది. వీటి బాధ్యతను ఉపాధి హామీ సిబ్బందికి కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి 56 మండలాల్లో 2,01,982 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 75 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి.
మార్కాపురం మండలంలో 3,540కి గానూ 1153 పూర్తయ్యాయి. తర్లుపాడు మండలంలో 3317కు గానూ 1139, కొనకనమిట్ల మండలంలో 5306కు గానూ 1085, కురిచేడులో 4082కు గానూ 1104, దొనకొండలో 4334కు గాను 1019 మాత్రమే పూర్తయ్యాయి. దోర్నాల మండలంలో 4885కు గానూ 1705, కొనకనమిట్ల 5306కు గాను 1082, పెద్దారవీడు 4483కు గాను 1622, పుల్లలచెరువు 3576కు గాను 1244, తర్లుపాడు 3317కు గాను1135, త్రిపురాంతకం 4721కు గాను 1280, యర్రగొండపాలెం 4729కు గాను 1603 వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తయ్యాయి.
ఈ నిర్మాణాలను చూస్తే పథకం అమలు ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిర్మాణం పూర్తయి బిల్లులు రాని వ్యక్తిగత మరుగుదొడ్లు ఈ ఐదు మండలాల్లో సుమారు 1400 వరకు ఉన్నాయి. ఏడాది క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పటికీ బిల్లులు చెల్లించకపోవటంతో కొత్తగా నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి సుమారు రూ 13 వేలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం రూ 10,200 మాత్రమే అందజేస్తుంది. అయినా కట్టుకున్న వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. దీంతో లబ్ధిదారుల్లో నిరాసక్తత ఏర్పడింది.
పది రోజుల్లో ఇస్తాం.. సుందరరావు, అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్
ఉపాధి హామీ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకున్న వారికి 15వ తేదీలోపు బిల్లులు చెల్లిస్తాం. జాప్యం జరిగిన మాట వాస్తవమే. లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామాల్లో తిరుగుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందికి మెమోలు ఇస్తున్నాం.
ఏడాదైనా బిల్లు రాలేదు జానపాటి సుబ్బమ్మ, వేములకోట
ఏడాది కిందట మరుగుదొడ్డి నిర్మించుకున్నా బిల్లులు రాలేదు. ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో అంటూకాలం గడుపుతున్నారు. దీంతో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే దాని కంటే రూ 2వేలు అదనంగా ఖర్చు చేస్తున్నా, ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారు.
నిధులున్నా..నీరసమే
Published Mon, Jan 20 2014 2:51 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement