
బస్సు ప్రమాదం ... ఉన్నతాధికారులపై వేటు
బెంగళూరు : మడకశిర ఘటనపై ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులపై వేటు వేసింది. మడకశిర డిపో ఆర్ఎంతోపాటు ముగ్గురు ఆర్ అండ్ బీ అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. గురువారం బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయనతోపాటు సహచర మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావులు పరామర్శించారు. క్షతగాత్రులకు మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం కొలంబియా ఆసుపత్రికి తరలిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
బుధవారం మడకశిర నుంచి పెనుగొండ వెళ్లున్న ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. మరో 54 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంతోపాటు రహదారులు సరిగాలేవని, బస్సు కండిషన్ కూడా బాగోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా ఉన్నతాధికారులపై వేటు వేసింది.