సాక్షి, హైదరాబాద్: పీఆర్సీపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ ‘పీఆర్సీపై కదలిక ఏది?’ శీర్షికన సాక్షి వార్త ప్రచురించిన నేపథ్యంలో.. ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాల జేఏసీలో కదలిక వచ్చింది. గురువారం మధ్యాహ్నం జేఏసీ నేతలు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడును కలిశారు.
పీఆర్సీ జీవోలు ఇవ్వడం కంటే మంచి ‘నష్ట నివారణ మార్గం’ వేరొకటి లేదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ ఆమోదం లేకుండా జీవోలిచ్చే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. ముందు జీవోలు జారీ చేసి, తర్వాత మంత్రివర్గ ఆమోదముద్ర వేయించాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకనుగుణంగా.. ఈనెల 6న జీవోలు వెలువరించడానికి ఏర్పాట్లు చేయాలని ఆర్థికమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అనంతరం.. 6న జీవోలు ఇస్తామని జేఏసీ నేతలకు ఆర్థిక మంత్రి యనమల చెప్పారు.
రాజధానికి రూ.200 కోట్ల విరాళం...
ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం ఏపీఎన్జీవో హోంలో జరిగిన జేఏసీ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. 6న పీఆర్సీ జీవోలు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పినట్టు ప్రకటించారు. కాగా 15 రోజుల పీఆర్సీ బకాయిలను రాజధానికి విరాళంగా ఇవ్వాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పత్రికల్లో వచ్చిన వార్తలపై సమావేశంలో చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ అనంతరం.. 15 రోజుల బకాయిలను విరాళంగా ఇవ్వడానికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. 15 రోజుల పీఆర్సీ బకాయిల విలువ రూ.200 కోట్లు ఉంటుందని, జేఏసీ విరాళం ఇచ్చిన విషయం శాశ్వతంగా గుర్తుండేలా.. ఉద్యోగుల విరాళంతో రాజధానిలో ఒక బ్లాక్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాలని పలు సంఘాలు సూచించాయి. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు అధ్యక్షత వహించారు.
పీఆర్సీపై కదలిక.. 6న జీవోల జారీ
Published Fri, Apr 3 2015 2:07 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM
Advertisement