- ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆదేశం
- 2007 నుంచి విద్యార్థుల వివరాలు కోరిన వైనం
సాక్షి, అనంతపురం : ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు 2007 నుంచి ఇప్పటి దాకా అందిన ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకార వేతనాల వివరాలను అందజేయాలని ప్రభుత్వం ఆయా కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. విద్యార్థుల వివరాలు, సర్టిఫికెట్లు, వారి రేషన్, ఆధార్ కార్డులు, ఎఫ్‌ఎస్‌ఐడీ నంబర్లు ఇవ్వాలని సూచించింది. దీంతో యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. జిల్లాలో ప్రయివేటు జూనియర్ కళాశాలలు 109, డిగ్రీ 35, ఇంజనీరింగ్ కళాశాలలు 18 ఉన్నాయి.
వీటిలో అధిక భాగం టీడీపీ నేతల ఆధీనంలోనే నడుస్తున్నాయి. చాలా కళాశాలల్లో విద్యార్థులు లేకపోయినా.. ఉన్నట్లుగా రికార్డులు సృష్టించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. ఇక ఫీజు రీయింబర్స్‌మెంటు కోసమే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. ఈ కళాశాలల్లో వసతులు,ప్రమాణాలు లేకపోయినా ప్రభుత్వ సొమ్మును మాత్రం దర్జాగా స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి.
మరోవైపు కొందరు విద్యార్థులు ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ కోర్సుల్లో చేరి ప్రయోజనం పొందినట్లు తెలుస్తోంది. జిల్లాలోని మెజార్టీ కళాశాలల్లో విద్యార్థులు ఏదో ఒక కోర్సులో చేరి.. ఆ తరువాత బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునేవారు. పరీక్షలకు మాత్రమే హాజరయ్యేవారు.
కాగా, కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
ఇందులో భాగంగానే గత ఏడేళ్ల రికార్డులను కోరింది. ఇప్పుడు ఆ వివరాలు అందజేస్తే తమ లోపాలు ఎక్కడ బయటపడతాయోనని కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో అధికారులను లొంగదీసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు పొందిన కళాశాలలు ఇప్పుడు ఆ అవకతవకలు వెలుగులోకి రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే యాజమాన్యాలన్నీ ఒక రింగ్‌గా ఏర్పడి జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించినట్లు సమాచారం. పనిలో పనిగా రికార్డులు తమ వద్ద లేవని, అధికారుల వద్ద ఉన్న వాటినేప్రామాణికంగా తీసుకోవాలంటూ తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఉమాదేవిని ‘సాక్షి’ వివరణ కోరగా... ప్రభుత్వం వివరాలను కోరిన విషయం వాస్తవమేనన్నారు. ప్రస్తుతం తాము అదేపనిలో ఉన్నట్లు తెలిపారు.
బో‘ధనం’ వివరాలివ్వండి
Published Tue, Jul 1 2014 4:06 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement