సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశంగా మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ సంస్థ తేల్చింది. ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో ఏపీ ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, ఆయా అంశాల్లో ఓటర్లు ఇచ్చిన స్కోరును బట్టి తేలింది. ఐఐఎం–బెంగళూరు ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి ఈ ఫౌండర్ చైర్మన్‌గా ఉన్న ఏడీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 2018 అక్టోబరు నుంచి 2018 డిసెంబరు మధ్య కాలంలో 534 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 2,73,487 మంది ఓటర్లను సర్వే చేసింది. ఫలితాలను సోమవారం ఇక్కడ విడుదల చేసింది. పాలనాంశాలకు సంబంధించి ఓటర్ల ప్రాధాన్యతలు, ఆయా అంశాల్లో ప్రభుత్వ పనితీరుపై ఓటర్ల రేటింగ్, ఓటింగ్ ప్రవర్తనపై ప్రభావం చూపే కారకాలు అన్న మూడు అంశాలు తేల్చే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించింది.
పాలనకు సంబంధించి మొత్తం 31 ప్రాధాన్యతాంశాలను ఓటర్ల ముందుంచి అందులో మొదటి ఐదు ప్రాధాన్యత అంశాలను గుర్తించాలని ఓటర్లను కోరింది. అలాగే ఆయా అంశాలపై ప్రభుత్వ పనితీరును గుడ్, యావరేజీ, బ్యాడ్ అనే మూడుస్థాయిల స్కేల్‌పై గుర్తించాలని కోరింది. ఐదు మార్కుల్లో ఐదు మార్కులు ఇస్తే గుడ్ అని, మూడు మార్కులు ఇస్తే యావరేజీ అని, 1 మార్కు వస్తే బ్యాడ్ అని పరామితిని నిర్ధేశించింది. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాధాన్యత లభించిన 10 అంశాల్లో మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ప్రాథమిక అవసరాలు అందించే వైద్యం, తాగునీరు, రోడ్లు, ప్రజారవాణా.. ఈ ఐదు టాప్–5లో నిలిచాయి. అయితే ఆయా అంశాల్లో ఆయా ప్రభుత్వాల పనితీరుపై ఓటర్లు సంతృప్తిగా లేకపోవడం గమనార్హం. ప్రతి అంశంలోనూ యావరేజీ కంటే తక్కువ మార్కులు సాధించాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు అద్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మూడు అంశాల్లో మెరుగైన ఉపాధి/ఉద్యోగ అవకాశాలు, తాగునీరు, మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఈ మూడు అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్వానంగా ఉంది. బిలో యావరేజీ స్కోరు(ఐదింట మూడు మార్కుల కంటే తక్కువ) మాత్రమే దక్కించుకోవడం గమనార్హం. మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనే అంశాన్ని 46.14 శాతం ఓటర్లు ప్రాధాన్యత కలిగిన అంశంగా ఎంచుకోగా, వారు ప్రభుత్వ పనితీరుకు కేవలం 2.10 మార్కులే ఇచ్చారు. తాగునీటి అంశాన్ని 45.25 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతాంశంగా ఎంచుకోగా.. ఆ అంశంలో ప్రభుత్వ పనితీరుపై కేవలం 2.04 మార్కులు మాత్రమే ఇచ్చారు. మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంశాన్ని 31.40 శాతం మంది ప్రాధాన్యత అంశంగా ఎంచుకోగా.. ఈ అంశంలో ప్రభుత్వ పనితీరుపై కేవలం 2.72 స్కోరు మాత్రమే దక్కించుకుంది. ఏ ఒక్క అంశంలోనూ ప్రభుత్వం యావరేజీ స్కోరును కూడా అందుకోలేదు.
ఏపీ గ్రామీణం ఇలా.. పట్టణ ప్రాంతాలు అలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యంత ప్రాధాన్య అంశాలుగా మూడింటిని ఎంచుకున్నారు. 48 శాతం మంది సాగునీటి లభ్యత, 46 శాతం మంది వ్యవసాయ సబ్సిడీలు(విత్తనాలు, ఎరువులకు), 44 శాతం మంది వ్యవసాయానికి విద్యుత్తు అనే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వీరు ఆయా అంశాల్లో ప్రభుత్వానికి ఇచ్చిన మార్కులు యావరేజీ కంటే తక్కువ. మొదటి అంశానికి 2.13 మార్కులు, రెండో అంశానికి 1.99 మార్కులు, మూడో అంశానికి 2.19 మార్కులు ఇచ్చారు. ఇక పట్టణ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మూడు అంశాల్లో మెరుగైన ఉపాధి/ఉద్యోగ అవకాశాలు, తాగునీరు, నీరు, కాలుష్యం.
58 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతగా ఎంచుకున్న మెరుగైన ఉపాధి అవకాశాలు అనే అంశంలో ప్రభుత్వ పనితీరుకు 2.13 మార్కులు ఇచ్చారు. 55 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యత అంశంగా ఎంచుకున్న తాగునీటి అంశంలో ప్రభుత్వ పనితీరుకు వారు ఐదు మార్కులకు గానూ 1.91 మాత్రమే ఇచ్చారు. అలాగే నీరు, కాలుష్యం అనే అంశాన్ని 53 శాతం పట్టణ ఓటర్లు ప్రాధాన్యత అంశంగా ఎంచుకోగా.. వారు ఈ అంశంలో ప్రభుత్వ పనితీరుకు 2.19 మార్కులు ఇచ్చారు. ఏ అంశంలోనూ ప్రభుత్వం యావరేజీ స్కోరు కూడా సాధించలేకపోయింది. ఇక ఈ సర్వేలో ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల వారీగా టాప్–3 ప్రాధాన్యత గల అంశాలను ఏడీఆర్ సంస్థ ప్రచురించింది.
ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వానం
Published Tue, Mar 26 2019 5:18 AM | Last Updated on Tue, Mar 26 2019 10:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment