సర్కారుపై సమరం
- మూడో రోజూ ఉద్యమించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- మాట తప్పారంటూ చంద్రబాబుపై ధ్వజం
- జిల్లా అంతటా ధర్నా లు, రాస్తారోకోలు
సాక్షి, విశాఖపట్నం : బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చాక హామీల్ని అమలు చేయకపోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆది నుంచీ అలవాటేనంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధ్వజమెత్తాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు రుణమాఫీ షరతులకు వ్యతిరేకంగా నరకాసుర వధ పేరిట మూడో రోజు శనివారం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. రైతులు, డ్వాక్రా మహిళలతో కలిసి రాస్తారోకో, ధర్నా, మానవహారాలు నిర్వహిం చాయి. ఎన్నికల
హామీలు అమలు చేసేంత వరకు విశ్రమించేది లేదని భీష్మించాయి.
నర్సీపట్నం నియోజకవర్గం కోటవురట్లలో ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యోంలో భారీ ర్యాలీ నిర్వహించి, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పీఏసీఎస్ కార్యాలయం ఎదుట మానవహారం నిర్వహించారు. డిప్యూటీ తహశీల్దార్‌కు జెడ్పీటీసీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మి వినతిపత్రాన్ని అందించారు.
పాయకరావుపేట నియోజకవర్గం సత్యవరంలో పార్టీ రాష్ట్ర యువజన కమిటీ సభ్యుడు, జెడ్పీటీసీ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు.
అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త కొణతాల రఘునాథ్ నేతృత్వంలో మానవహారం, నిరసన ర్యాలీ జరిగింది. ఆర్డీవో వసంతరాయుడుకు వినతిపత్రం అందించారు.
చోడవరం మండల పరిషత్ కార్యాలయం నుంచి గ్రామీణ బ్యాంకు వరకు మాజీ ఎంపీపీ శెట్టి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బజార్‌రోడ్డు జంక్షన్లో మానవహారంగా ఏర్పడి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
మాడుగుల నియోజకవర్గం వడ్డాది నాలుగురోడ్ల జంక్షన్లో డీసీసీబీ మా జీ డెరైక్టర్ కోవెల జనార్దనరావు, సీడీసీ మాజీ చైర్మన్ కర్రి తమ్మునాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టారు.
పాడేరు నియోజకవర్గం జీకే వీధి జంక్షన్ నుంచి సంతబయలు వరకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
యలమంచిలి నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో మునగపాక మెయిన్ రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పార్టీ కన్వీనర్లు మళ్ల సంజీవరావు, శేషగిరిరావు, పిన్నమరాజు చంటిరాజు పాల్గొన్నారు.