తుంగభద్ర డ్యాంను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ కాపురామచంద్రారెడ్డి , నాయకులు
సాక్షి, కణేకల్లు: హెచ్చెల్సీ ఆయకట్టుకు సకాలంలో సాగు నీరు అందించి, రైతులను ఆదుకోవడమే మా కర్తవ్యమని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్చెల్సీకి రావాల్సిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకొని ఆయకట్టుకు నీరిస్తామన్నారు. కర్ణాటకలో ఉన్న అంతరాష్ట్ర భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ తుంగభద్ర డ్యాంను ప్రభుత్వ విప్ కాపు మంగళవారం సందర్శించారు. అనంతరం తుంగభద్రడ్యాం ఎస్‌డీఈ శ్రీనివాసనాయక్‌తో కలిసి విప్ విలేకరులతో మాట్లాడారు. తుంగభద్రడ్యాం పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల డ్యామ్‌కు భారీస్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి భారీ స్థాయిలో నీరొస్తోందన్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 100 టీఎంసీలు ఉన్నాయని, ఆతర్వాత నీటి లభ్యత ఎంత ఉంటుందనేది టీబీ బోర్డు అధికారులతో చర్చించి, మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను తప్పకుండా తీసుకుంటామన్నారు.
ఐఏబీ సమావేశంలో చర్చించి నిర్ణయం :
డ్యాంలో నీటి లభ్యత, దామాషా ప్రకారం హెచ్చెల్సీకి నీటి కేటాయింపులు, సాగునీటి కేటాయింపులు, రోజువారి ఇండెంట్ వీటన్నిటినీ ఐఏబీ సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటామని కాపు అన్నారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి అవసరం ఉండటంతో ఐఏబీ సమావేశం కంటే ముందు ఆయకట్టుకు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటరు వద్ద గరిష్ట స్థాయిలో నీళ్లను డ్రా చేసుకొని ఓ వైపు సాగుకు నీరిస్తూ మరో వైపు తాగునీటి అవసరాల కోసం పీఏబీఆర్‌కు తరలిస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు ఆలూరు చిక్కణ్ణ, ఈశ్వర్‌రెడ్డి, కాంతారెడ్డి, మల్లికార్జున, కణేకల్లు పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ టీ.కేశవరెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు మారెంపల్లి మారెన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment