గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తాం: వెంకయ్య
న్యూఢిల్లీ: గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తామని పట్టణాభివృద్ది శాఖామంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. బుధవారం కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతల్ని స్వీకరించిన వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ.. అందరికి ఇళ్లు అనే లక్ష్యం సాధించాలంటే వడ్డీ రేట్లు తగ్గించకతప్పదు అని వ్యాఖ్యానించారు. గృహ నిర్మాణం అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశమని.. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో ఈ అంశంపై చర్చిస్తానని అన్నారు.
వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీడీఏ ప్రభుత్వంలో కూడా గృహ నిర్మాణమే అత్యంత ప్రాధాన్యత అంశమనే విషయాన్ని గుర్తు చేశారు. వాజ్ పేయి ప్రభుత్వంలో వడ్డీ రేట్లను 11 శాతం నుంచి 7 శాతానికి తీసుకువచ్చామని వెంకయ్య అన్నారు. 2020 నాటికి అందరికి ఇళ్లు అనే లక్ష్యాన్ని సాధించాలంటే వడ్డీ రేట్లు తప్పించాల్సిందేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.