‘గాంధీ విధానాలు భావితరాలకు ప్రేరణ’ | Governor Biswabhusan Harichandan Speech In Vijayawada | Sakshi
Sakshi News home page

‘గాంధీ విధానాలు భావితరాలకు ప్రేరణ’

Published Wed, Oct 2 2019 1:04 PM | Last Updated on Wed, Oct 2 2019 1:49 PM

Governor Biswabhusan Harichandan Speech In Vijayawada - Sakshi

వయోజన విద్యోద్యమాల మాసపత్రిక, గ్రంధాలయ సర్వస్వం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్‌  బిశ్వభూషణ్‌ హరిచందన్‌

సాక్షి, విజయవాడ : యువతకు గాంధీజీ ఇచ్చిన సందేశాలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సమకాలీనంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ, గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీజీ 150వ జయంతి వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ స్మారక నిధి సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘గాంధీజీ ఫోటో ఎగ్జిబిషన్‌’ను బిశ్వభూషణ్ ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధులను గవర్నర్ సన్మానించి అభినందనలు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం గ్రంథాలయ వయోజన విద్యోద్యమాల మాసపత్రిక, గ్రంథాలయ సర్వస్వం పుస్తకాన్ని, సీడీని ఆయన  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ తెలుగులో నమస్కారం చెప్పి మాట్లాడుతూ.. గాంధీజీ 150వ జయంతి నాడు ఆయన చెప్పిన మంచి విషయాలు మననం చేసుకోవాలని సూచించారు. పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ గాంధీజీ ఆలోచనలను అనుసరించేవారని తెలిపారు. మహాత్మాగాంధీ విధానాలు భావితరాలకు ఒక ప్రేరణ కావాలన్నారు. గాంధీ వెనుక ఉన్న భారతీయులు గర్జిస్తే ఒక భూకంపం వచ్చినట్టుగా ఉండేదని చెప్పారు. స్వతంత్ర్య సమరయోధులకు సన్మానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గాంధీజీ ఆలోచనలు, విధానాలు ఉపాధ్యాయులకు చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అహింస, సత్యం మాట్లాడటం గాంధీజీ నేర్పిన అంశాలని గుర్తుచేస్తూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు ఎన్నటికీ మర్చిపోలేనివని వ్యాఖ్యానించారు. తెలుగు తనకు అర్ధం కాకపోయినా, విద్యార్ధులు మాట్లాడిన మాటలు వారి ఉద్వేగం నుంచి అర్ధం చేసుకున్నానని చెప్పారు. ఈ కార్యకమంలో విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. దేశభక్తి  గీతాలతో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనకు గవర్నర్ మంత్రముగ్ధులయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement