సాక్షి, విజయనగరం: గిరిజనుల జీవన విధానాన్ని తను వ్యక్తిగతంగా చూశానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వారితో మైత్రిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పాచిపెంట మండలం అమ్మవలస ఆదివాసి గ్రామాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన గిరిజన రైతులతో మాట్లాడారు. వాళ్ల బ్యాంకు ఖాతాలకు ఎంత సొమ్ము జమ అవుతుందో ఆరా తీశారు. ఈ క్రమంలో అమ్మవలస ఆదివాసి గిరిజన రైతులు సాగుచేస్తున్న ఉద్యానవన పంటలను సందర్శించి గిరిజన రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వరి , మొక్కజొన్న, అరటి, పత్తి, మామిడి, జీడిమామిడి తదితర పంటల సాగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవలస ఆదివాసి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యే రాజన్న దొర కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. గిరిజనుల జీవన విధానాన్ని వ్యక్తిగతంగా చూసి, వారి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. సమస్యల పరిష్కార చర్యలపై ప్రభుత్వానికి సూచిస్తానని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు వేల సంవత్సరాలు నుంచి వచ్చాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కాపాడటం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం రెండు ప్రధాన అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని నిర్వహించే క్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గిరిజనులు విద్యకు ప్రాధ్యాన్యత ఇచ్చి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏఎన్ఎం వ్యవస్థ, పీహెచ్‌సీలు ఏర్పాటు చేసినా భౌగోళికపరంగా సమస్యలు ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడం.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
గిరిజన యువత ఉపాధి కోసం కొత్త రంగాలను ఎంచుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పోటీ పరిక్షలకు సిద్ధం అవుతూ.. తమను తాము మార్చుకుని ప్రభుత్వం సహకారం పొందాలని వివరించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. పరిష్కారం కోసం ఆ వివరాలను ప్రభుత్వానికి సూచించడం తన బాధ్యత అన్నారు. గిరిజనులతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని.. ఈ మైత్రి బంధాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తాని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వాభివృద్ధి ఫలాలు అందుతున్న తీరును పరిశీలించేందుకు గవర్నర్ రావడం శుభసూచకం అన్నారు. ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాల్లో విద్య, వైద్యం అందాల్సి ఉందని గుర్తుచేశారు. పాడేరులో మెడికల్ కళాశాల, సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం రాబోతున్నాయని వెల్లడించారు. గిరిజన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని శ్రీవాణి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కోటియా గ్రామాల సమస్యను ఎమ్మెల్యే రాజన్నదొర గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ.. కోటియా గ్రామాల గిరిజనులు సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అభివృద్ధిలో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌కి విన్నవించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment