గవర్నర్‌కు చేతకాకుంటే కేంద్రానికి ఫిర్యాదు
- పలు అంశాలపై తెలంగాణతో సమస్యలున్నాయి :కేఈ
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. గవర్నర్‌కు ఆ పని చేతకాకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. తాజాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ 45 నిముషాల పాటు చర్చించినా ఎలాంటి పురోగతి లేదు.’ అని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కరెంటు, సాగునీరు, ఎంసెట్ ప్రవేశ పరీక్ష.. ఇలా ఎన్నో అంశాలపై తెలంగాణ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందని, వీటన్నిటినీ గవర్నర్ పరిష్కరించాలన్నారు. ఇకపై ఇలాంటి సమస్యల పరిష్కారానికి కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వాస్తుదోషాల పేరుతో తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు సచివాలయాన్ని మార్చడాన్ని మంత్రి తప్పుపట్టారు.
ఇక్కడి కార్యాలయాల్లో, సచివాలయంలో ఉండేందుకు తమకు పదేళ్లపాటు హక్కు ఉందని, అంతవరకూ ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తాం అంటూ కేసీఆర్ భాష మాట్లాడటం సరికాదన్నారు.