'గవర్నర్ తో మాట్లాడిన విషయాలు మీడియాకు చెప్పలేను'
హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంసెట్ ఉమ్మడి నిర్వహణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్ రెడ్డిలు శనివారం సమావేశమైయ్యారు.
ఈ సమావేశం అనంతరం మాట్లాడిన గంటా.. ఈ అంశంపై అవసరమైతే మరోసారి గవర్నర్ నరసింహన్తో భేటీ అవుతామన్నారు. గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎవరి వాదనలు వారు వినిపించామని గంటా తెలిపారు. దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పలేను కానీ పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. గవర్నర్ తో చర్చించిన విషయాలు మీడియాకు చెప్పలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.