eamcet issue
-
ఎంసెట్ అంశాన్ని హోంమంత్రికి తెలియజేస్తా: వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఎంసెట్ పరీక్ష నిర్వహణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదానికి పరిష్కారం కనుగొనేలా ఈ అంశాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఎంసెట్ అంశం తన పరిధిలోనిది కానందున, అంతకు మించి తన జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ అంశంపై రెండు రాష్ట్రాలు చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. చిన్నచిన్న విషయాలను పెద్దది చేసి విద్యార్థులను ఆందోళనకు గురిచేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. విభజన చట్టంలోని అంశాల అమలులో ఏవైనా అనుమానాలు తలెత్తినప్పుడు గవర్నర్ లేదా కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ వద్ద సమస్య పరిష్కారం కానందున ఇరు రాష్ట్రాలు కోరితే సమస్యను పరిష్కరించేలా కేంద్ర హోంమంత్రికి ఈ అంశాన్ని తెలియజేస్తాను’ అని అన్నారు. ఈ అంశానికి రాజకీయరంగు పులిమే ప్రమాదం ఉన్నందున పరిమితికి మించి తాను జోక్యం చేసుకోదల్చుకోలేదన్నారు. -
'గవర్నర్ తో మాట్లాడిన విషయాలు మీడియాకు చెప్పలేను'
హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంసెట్ ఉమ్మడి నిర్వహణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్ రెడ్డిలు శనివారం సమావేశమైయ్యారు. ఈ సమావేశం అనంతరం మాట్లాడిన గంటా.. ఈ అంశంపై అవసరమైతే మరోసారి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అవుతామన్నారు. గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎవరి వాదనలు వారు వినిపించామని గంటా తెలిపారు. దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పలేను కానీ పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. గవర్నర్ తో చర్చించిన విషయాలు మీడియాకు చెప్పలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
ఎంసెట్ నిర్వహణపై గవర్నర్ సమక్షంలో చర్చలు
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్ రెడ్డిల మధ్య జరిగిన సమావేశం ముగిసింది. ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు నష్టపోకుండా సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిపారు. -
ఎంసెట్ వివాదంపై మంత్రులతో చర్చించనున్న గవర్నర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ రోజు సాయంత్రం ఇరు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో సమావేశంకానున్నారు. ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ మంత్రులను చర్చలకు పిలిచారు. కాగా ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఎంసెట్ నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం గవర్నర్‌ను కలిశారు. ఇరు రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు భిన్నవాదనలు వ్యక్తం చేస్తుండటంతో సమస్య పరిష్కారం కోసం గవర్నర్ మరోసారి చర్చించనున్నారు. -
తెలంగాణ వాదనకు గవర్నర్ ఒప్పుకోలేదు!
ఎంసెట్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై రాజ్ భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఎంసెట్ నిర్వహణ హక్కు తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుందన్న ఆ సర్కారు వాదనకు గవర్నర్ నరసింహన్ ఒప్పుకొన్నారన్న వానదలో నిజం లేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని మాత్రమే గవర్నర్ సూచించనట్లు తెలిపాయి. అయితే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వచ్చిన తర్వాత.. తమ వాదనతో గవర్నర్ ఏకీభవించినట్లు చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహించే హక్కు తమకే ఉంటుందని, కావాలంటే ఆంధ్రప్రదేశ్‌కు కూడా తామే నిర్వహిస్తామని అన్నారు.