ఎంసెట్ అంశాన్ని హోంమంత్రికి తెలియజేస్తా: వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఎంసెట్ పరీక్ష నిర్వహణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదానికి పరిష్కారం కనుగొనేలా ఈ అంశాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఎంసెట్ అంశం తన పరిధిలోనిది కానందున, అంతకు మించి తన జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఈ అంశంపై రెండు రాష్ట్రాలు చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. చిన్నచిన్న విషయాలను పెద్దది చేసి విద్యార్థులను ఆందోళనకు గురిచేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. విభజన చట్టంలోని అంశాల అమలులో ఏవైనా అనుమానాలు తలెత్తినప్పుడు గవర్నర్ లేదా కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ వద్ద సమస్య పరిష్కారం కానందున ఇరు రాష్ట్రాలు కోరితే సమస్యను పరిష్కరించేలా కేంద్ర హోంమంత్రికి ఈ అంశాన్ని తెలియజేస్తాను’ అని అన్నారు. ఈ అంశానికి రాజకీయరంగు పులిమే ప్రమాదం ఉన్నందున పరిమితికి మించి తాను జోక్యం చేసుకోదల్చుకోలేదన్నారు.