వాటిని జీర్ణించుకోలేకే విమర్శలు: రాజ్‌నాథ్, వెంకయ్య
న్యూఢిల్లీ: దేశంలోని పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి కోసమే ప్రధాని తాజాగా నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు విమర్శించారు. రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం మాట్లాడుతూ.. ప్రధాని ప్రకటించిన నిర్ణయాలు ప్రజల కోసం.. అభివృద్ధి కోసమని, తన నాయకత్వ పటిమ, విజన్ తో దేశాన్ని ప్రధాని ముందుకు తీసుకెళుతున్నారని పేర్కొన్నారు.
ప్రధాని నిర్ణయాల వల్ల గ్రామీణులు, పేదలు, రైతులతో పాటు సమాజంలోని మిగతా వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందకపోతే దేశం బలమైనదిగా మారలేదని చెప్పారు. మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. బ్లాక్‌మనీకి సంబంధించి డాటా వెల్లడైన తర్వాత ప్రతిపక్షాల అసలు బండారం బట్టబయలవుతుందన్నారు.