అవినీతి లేకుండా మోదీ పాలన: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడేళ్ల పాలన ఎలాంటి అవినీతి లేకుండా సాగిందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ నవీనభారత్ అనే దృక్పథంతో మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఏ సర్వేలు చూసినా బీజేపీకి అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్షాలకు ఏం చేయాలో తెలియక నిరాశానిస్పృహల్లో ఉన్నాయన్నారు. నేషనల్ ఫ్రంట్ పేరుతో గతంలో థర్డ్ ఫ్రంట్ పెట్టుకుంటే అది మూడో స్థానంలోకే వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు.
కమ్యూనిస్టు, కాంగ్రెస్‌పార్టీలు కేరళలో తిట్టుకుని, ఢిల్లీ లో కలుస్తాయని వెంకయ్య విమర్శించారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు పశ్చిమబెంగాల్‌లో కొట్టుకుని ఢిల్లీలో కలుస్తాయని అన్నారు. కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో తప్ప దేశం అంతా ప్రశాంతంగా ఉందన్నారు. నక్సలైట్లు కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితయ్యారని చెప్పారు. తెలంగాణ పర్యనటకు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కుటుంబపాలన మంచిదికాదని అనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కుటుంబ రాజకీయాల గురించి రాహుల్‌గాంధీ మాట్లాడటం గురివింద గింజ సామెతలాగా ఉందని వెంకయ్యనాయుడు విమర్శించారు.
సబ్ కా సాత్–సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింతర్వాత అభ్యర్థిని మీడియా ముందు ప్రకటిస్తామన్నారు. కాగా, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా బీజేపీ సీనియర్‌నేత కె.రాములు ఎంపికైనందుకు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలను తెలిపారు.