మోదీ ప్రగతిశీల నాయకుడు | Modi is progressive leader | Sakshi
Sakshi News home page

మోదీ ప్రగతిశీల నాయకుడు

Published Sat, Jan 9 2016 2:20 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

మోదీ ప్రగతిశీల నాయకుడు - Sakshi

మోదీ ప్రగతిశీల నాయకుడు

 గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి: సీఎం కేసీఆర్
 
 సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ప్రగతిశీల నాయకుడని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి మోదీ అని చెప్పారు. ఎదుటి వారి సూచనలు, సలహాలను సావధానంగా వినే ఓపిక ఆయన సొంతమని పేర్కొన్నారు. శుక్రవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో 21వ ఆల్ ఇండియా బిల్డర్స్ సమాఖ్య సదస్సు ప్రారంభమైంది. నిర్మాణ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ముందున్న సవాళ్లు, ప్రభుత్వాల నుంచి అందాల్సిన సహకారంపై ఇందులో చర్చించనున్నారు. సీఎం కేసీఆర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సుప్రారంభించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం నుంచి వెళ్తూ రాష్ట్ర ప్రభుత్వాల చేతులు కట్టేసిందన్నారు. ప్రణాళిక సంఘం పేరిట రాష్ట్రాల సీఎంలను బిచ్చగాళ్లలా చూసేవాళ్లన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ పరిస్థితి మారిందన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన భూసేకరణ చట్టం ద్వారా పారిశ్రామికీకరణ, మౌళిక సదుపాయాల కల్పన ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. దీంతో తాము అధికారంలోకి వచ్చాక 123 జీవో తీసుకువచ్చి భూసేకరణకు బదులు భూమిని కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి కావాలనుకుంటే ప్రజల నుంచి భూమిని తీసుకోకతప్పదని, భూమి కోల్పోయిన వారికి తగిన పరిహారం, పునరావాసం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాల మూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభానికి ముందే దేశంలోనే తొలిసారిగా ప్రజల నుంచి భూమి కొనుగోలు చేశామని వివరించారు.

 ప్రపంచమంతటా తెలుగు కాంట్రాక్టర్ల ప్రతిభ...
 నిర్మాణదారులకు ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తే కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం ప్రోత్సాహకంగా అందజేస్తామని వెల్లడించారు. కాంట్రాక్టర్లను ఇకపై వర్కింగ్ ఏజెన్సీలుగా పిలుచుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలుగు కాంట్రాక్టర్ల ప్రతిభ ప్రపంచమంతటా విస్తరించిందన్నారు. అఫ్గానిస్తాన్‌లో పార్లమెంట్ భవనాన్ని తెలుగు కాంట్రాక్టర్ శీనయ్య నిర్మించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్ర నిర్మాణ రంగ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని మంత్రి వెంకయ్యనాయుడును కోరారు.

కరుడు కట్టిన కమ్యూనిస్టువాదం ఉన్న చైనా ఒకప్పుడు వెనకబడి ఉండేదని, అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టిన కారణంగా ఇప్పుడు పక్కా ‘క్యాపిటల్’ దేశంగా మారిందని వివరించారు. ఇదే తరహాలో ప్రభుత్వాలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధి పథంలో నడవాలన్నారు. పార్లమెంట్‌లో కేంద్రం జీఎస్‌టీ బిల్లు ప్రవేశ పెడితే తాము బయట నుంచి మద్దతిస్తామని చెప్పారు. ఈ సదస్సును రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఫిల్మ్ సిటీ హైదరాబాద్‌కు ఆభరణమని కొనియాడారు.

 రియల్ ఎస్టేట్ బిల్లు తెస్తాం: వెంకయ్య
 రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రియల్ ఎస్టేట్, జీఎస్టీ బిల్లులను ప్రవేశపడతామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ బిల్లులకు ఆమోదం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి మౌలిక సదుపాయాల రంగం అత్యంత కీలకమని చెప్పారు. ఆధునిక, శక్తిమంతమైన దేశ నిర్మాణంలో బిల్డర్లు భాగస్వాములేనని పేర్కొన్నారు. నిర్మాణదారుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్తానని, అవసరమైతే వారిని ప్రధానితో కల్పిస్తానని హామీ ఇచ్చారు. మోదీ నేతృత్వంలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత్ ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా చెబుతున్నాయని వివరించారు.

రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 10 వేల కి.మీ. మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. సదస్సులో భాగంగా నిర్మాణ రంగంలో వినియోగించే వివిధ రకాల మిషన్లు, వాహనాలు, సిమెంట్, ఉపకరణాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్‌చంద్ శర్మ, అసోసియేషన్ ప్రతినిధులు రాధాకృష్ణ, శీనయ్య, నగేశ్ రెడ్డితో పాటు 1,200 మంది ఏ1 కాంట్రాక్టర్లు, టర్కీ నిపుణులు పాల్గొన్నారు. సదస్సులో జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లిఖార్జున్ రావు తరఫున ఆ సంస్థ సీఈవో కిశోర్‌కు, జీవీకే రెడ్డి, ఎన్‌ఎం సుబ్రమణ్యం తదితర బిల్డర్లకు బులంద్ భారత్ అవార్డులను అందజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement