వేడెక్కిన ‘రాష్ట్రపతి’ రాజకీయం
► సోనియాతో రాజ్‌నాథ్, వెంకయ్యనాయుడు సంప్రదింపులు
► తరువాత లెఫ్ట్ నేతలు ఏచూరి, కారత్, సురవరంలతో సమావేశం
► ఎవరి పేర్లనూ ప్రతిపాదించని మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం అధికార బీజేపీ విపక్షాలతో సంప్రదింపులు ప్రారంభించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఇతర సీనియర్ నేతలతో ఆమె నివాసంలో అరగంట పాటు సమావేశమయ్యారు. ఆ తరువాత సీపీఎం, సీపీఐ నాయకులతో వారివారి పార్టీ కార్యాలయాల్లో భేటీ అయ్యారు. అలాగే, బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళి మనోహర్ జోషిలను సైతం సంప్రదించారు.
అయితే, విపక్ష నేతలతో భేటీ సందర్భంగా కేంద్ర మంత్రులు రాష్ట్రపతి అభ్యర్థిగా తమవైపు నుంచి ఎవరి పేరునూ ప్రతిపాదించలేదు. బదులుగా, విపక్ష నేతలనే.. ఎవరినైనా ప్రతిపాదిస్తారా అని ప్రశ్నించారు. సోనియాతో భేటీ అనంతరం మంత్రులు.. సీసీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందాకారత్‌లను కలిశారు. తర్వాత సీపీఐ ఆఫీసులో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, పార్టీ నేతలు డీ రాజా, నారాయణలతో భేటీ అయ్యారు.
సోనియాతో రాజ్‌నాథ్, వెంకయ్య జరిపిన భేటీలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. సమావేశం తర్వాత ఆజాద్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ నిర్ణయం తీసుకోవడానికి వీలుగా బీజేపీ నేతలు ఎవరి పేర్లైనా సూచిస్తారని అనుకున్నాం. కానీ వారు తమవైపు నుంచి పేర్లు చెప్పకుండా పేర్లు ప్రతిపాదించాలని మమ్మల్నే అడిగారు.. పేర్లు ప్రతిపాదించకుండా మద్దతు, ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?’ అని అన్నారు. అభ్యర్థి పేరును ప్రస్తావించకుండానే మంత్రులు తమ పార్టీ మద్దతు కోరారని ఏచూరి తెలిపారు. ‘రాజ్యాంగ విలువలను పరిరక్షించే వ్యక్తే రాష్ట్రపతి కావాలని చెప్పాం’ అన్నారు.
ప్రణబ్‌తో భాగవత్ భేటీ
న్యూఢిల్లీ: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌తో సమావేశమయ్యారు. విందుకు రావాలని రాష్ట్రపతి ఆహ్వానించడంతో భాగవత్ వెళ్లారని ఆరెస్సెస్ తెలిపింది. రాష్ట్రపతి పదవికి భాగవత్ పేరును శివసేన ప్రతిపాదించిన నేపథ్యంలో భేటీ జరిగింది. అయితే తాను రేసులో లేనని భాగవత్ ఇదివరకే స్పష్టం చేశారు.అయితే, ఒకవేళ, రాష్ట్రపతి అభ్యర్థిగా భాగవత్‌ను బీజేపీ ఒప్పుకోకపోతే ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ పేరును సిఫార్సు చేస్తామని శివసేన తెలిపింది.