మనస్సాక్షి ప్రకారం ఓటేయండి: సోనియా
న్యూఢిల్లీ: రాష్ట్ర పతి ఎన్నికల్లో మనస్సాక్షితో ఓటేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్షాలకు ఆదివారం పిలుపునిచ్చారు. సంకుచిత భావం, విభజన–మత వాదాలపై ప్రతిపక్షం జరుపుతున్న పోరాటమే రాష్ట్రపతి ఎన్నికలని ఆమె అన్నారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్, ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాల క్రిష్ణ గాంధీలను సోనియా విపక్ష నాయకులకు లాంఛనంగా పరిచయం చేశారు.
‘మనం నమ్ముతున్న విలువలపై మనకు విశ్వాసం ఉండాలి. ఈ ఎన్నిక విభిన్న విలువలు, భావాల సంఘర్షణకు ప్రతినిధిగా నిలుస్తుంది. మహాత్మా గాంధీతోపాటు వేలాది మంది స్వాతంత్య్ర సమర యోధులు పోరాడి సాధించిన భారతదేశాన్ని రక్షించేందుకు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని ఎన్నిక కోరుకుంటోంది’ అంటూ విపక్ష నాయకులతో జరిగిన సమావేశంలో సోనియా ప్రసంగించారు. కాగా, ప్రభు త్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమా వేశానికి గైర్హాజరైన జేడీయూ నేతలు, విపక్షాల భేటీకి కూడా రాలేదు.