‘ఎవరనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు’
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి ఎవరనే దానిపై చర్చించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం అనంతరం మమతా మీడియాతో మాట్లాడారు. అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.
సమావేశం బాగా జరిగిందని, ఏకాభిప్రాయంతోనే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరుగుతుందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థినే ఎన్డీయే ఎంపిక చేస్తే మంచిదని, అలాంటివారికే తాము కూడా మద్దతు ఇస్తామన్నారు. అభ్యర్థి ఎంపికపై త్వరలోనే ఉమ్మడి ప్రకటన చేస్తామని మమతా పేర్కొన్నారు.
కాగా సోనియా అధ్యక్షత జరిగిన విపక్షాల సమావేశానికి దేవగౌడ, శరద్ యాదవ్, శరద్ పవార్, ఏచూరి సీతారం, సురవరం సుధాకర్‌రెడ్డి, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, మాయవతి, కనిమొళి, ఒమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విపక్ష నేతలకు సోనియా విందు ఇచ్చారు.