![కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేదు! - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/5/61495768852_625x300.jpg.webp?itok=9IsJWVNJ)
కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేదు!
నేడు ప్రతిపక్షాలకు సోనియా గాంధీ విందు
చర్చకు రానున్న రాష్ట్రపతి ఎన్నిక అంశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం ప్రతిపక్ష పార్టీల నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఇందులో రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై చర్చించే అవకాశాలున్నాయి. పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీల అగ్ర నాయకులు హాజరు కానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వేరే పనుల వల్ల అందుబాటులో ఉండటంలేదని, ఆయన తరఫున జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ హాజరవుతారని తెలిసింది.
ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం పంపలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. జేడీ(యూ), సీపీఐ, సీపీఎం, ఎస్పీ, డీఎంకే, ఎన్‌సీపీ, ఆర్జేడీ, టీఎంసీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపడానికి సోనియా కొంతకాలంగా అన్ని ఎన్డీఏయేతర పార్టీల నాయకులతో తీవ్రంగా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.