సాక్షి, తిరుమల: ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు కొత్త సంవత్సరం జనవరి తొలిరోజున శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించాలని కోరుకుంటారు.. అయితే, టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌లో మాత్రం కేవలం భజనలు చూపారు. ఇది చాలా అన్యాయం. ఆ ప్రసారాలు చూసిన నేనే చాలా బాధపడ్డాను’’ అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ దంపతులు శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు.
తర్వాత ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజుతో జనవరి 1నాటి ఎస్వీబీసీ ప్రసారాలపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘రాజుగారు..ఐ యాం వెరీ సారీ.. వాట్ హ్యాపనింగ్ ఇన్ ఎస్వీబీసీ చానల్.. నో కంట్రోల్, నో డి సి ప్లిన్.. ప్లీజ్ సీ, పరుస్యూ ద ప్రాబ్లమ్’’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రతి రోజూ వేకువజామున 3 నుంచి 4 గంటల మధ్యలో తోమాల, సహస్ర నామార్చన వంటి నిత్యసేవలు ప్రసారం చేస్తుంటారు. చాలా బాగుంటాయి. జనవరి మొదటి తారీకునే భజనలు వేయడం అన్యాయమండి’’ అన్నారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వందశాతం దేవుడినే దర్శించాలని కోరుకుంటారు తప్ప భజనల్ని కాదన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేంకటేశ్వరుడిని ప్రార్థించానన్నారు. గవర్నర్ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎస్వీబీసీ’లో ఏం జరుగుతోంది!?
Published Sat, Jan 4 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement