హస్తినలో గవర్నర్ నరసింహన్ బిజీ బిజీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తొందరపడుతున్న పరిస్థితులలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాంవేసిన గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గర నుంచి ముఖ్య నేతలందరిని కలిశారు. విభజనకు సంబంధించి కీలక అంశాలను ఆయన వారితో చర్చించినట్లు తెలుస్తోంది.
గవర్నర్ తొలుత నార్త్‌బ్లాక్‌లో ఆర్థిక మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిగాయి. విభజనకు సంబంధించి అంశాలపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఆయన బయటికి మాత్రం ఎటువంటి చర్చ జరగలేదని, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని చెబుతున్నారు.
చిదంబరంతో చర్చలు ముగిసిన వెంటనే గవర్నర్ యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. టెన్ జన్‌పథ్‌లో దాదాపు పావుగంట సేపు ఆమెతో చర్చించారు. అక్కడి నుంచి బయల్దేరి కేంద్ర హోం మంత్రి షిండేను కలిశారు. మంత్రుల బృందంలో ప్రత్యేక ఆహ్వానితుడు, కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి వి.నారాయణస్వామి, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఇబ్రహీంతోనూ నరసింహన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కూడా గవర్నర్ కలిశారు.
చివరగా సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. గవర్నర్ ఇలా దేశరాజధానిలో అందరినీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన ప్రక్రియ శరవేగంతో జరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది.