నేడే నరసింహన్‌ రాక | Governor Visiting Srikakulam Today | Sakshi
Sakshi News home page

నేడే నరసింహన్‌ రాక

Published Mon, Jul 9 2018 12:06 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Governor Visiting Srikakulam Today - Sakshi

 ఎచ్చెర్ల క్యాంపస్‌: రాష్ట్ర గవర్నర్‌ ఎక్కాడు శ్రీనివాసన్‌ లక్ష్మీ నరసింహన్‌ సోమవారం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్లలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పర్యటనకు చాన్సలర్‌ హోదా లో ఆయన వస్తున్నారు. విశ్వ విద్యాలయం ఏర్పాటయ్యాక ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి.

గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో వర్సిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను పక్కాగా రూపొందించారు. వర్సిటీలో జాతీయ రహదారి నుంచి పరిపాలన కార్యాలయం వరకు తారు రోడ్డు నిర్మాణం, భవనాలు మరమ్మతులు, రంగులు వేయటం, మొక్కలు ఆకర్షణీయంగా నాటటం వంటివి పూర్తి చేశారు. 

సోమవారం ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు గవర్నర్‌ వర్సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ.1.70 కోట్లతో నిర్మించిన మహిళా వసతి గృభ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ భవనంలోనే ఆయనకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. 11 గంటలకు వర్సిటీకి గవర్నర్‌ చేరుకుంటారు.

అనంతరం వరుసగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేయటం, పాలక మండలి సభ్యులతో సమావేశం, అధికారులతో సమీక్ష సమావేశం, వీసీ నివేదిక ప్రకటన, టీచింగ్, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్, విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు.

విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంత సేపు మాట్లాడనున్నారు. జాతీయ సేవాపథకం, సామాజిక అనుసంధాన కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 

ఎట్టకేలకు..

బీఆర్‌ఏయూను మొదటిసారి వర్సిటీ చాన్సలర్, గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సందర్శిస్తున్నా రు. వాస్తవంగా వర్సిటీలో ఏటా స్నాతకోత్సవం నిర్వహించాలి. ఈ స్నాతకోత్సవంలో వర్సిటీ చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ పాల్గొనాలి. అయితే ఇక్కడ వర్సిటీ ఏర్పాటై పదేళ్లవుతున్నా ఒక్కసారి కూడా గవర్నర్‌ రాలేదు.

స్నాతకోత్సవం సైతం ఒక్కసారి మాత్రమే జరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌ 23న స్నాతకోత్సవం జరిగింది. అప్పుడు కూడా గవర్నర్‌ వస్తారనే అంతా భావించారు. కానీ చివరి క్షణంలో ఆయన పర్యటన వాయిదా పడింది.

ప్రస్తుతం దేశంలో అన్ని వర్సిటీలను గవర్నర్‌లు సందర్శించాలని, ప్రగతి తెలుసుకోవాలని రాష్ట్రపతి సూచనలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన మొదటిసారి బీఆర్‌ఏయూ పర్యటనకు వస్తున్నారు.

వేధిస్తున్న సమస్యలు..

ఎచ్చెర్లలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాల యం 2008 జూన్‌ 25న ఏర్పాటు చేశారు. ఆంధ్రావిశ్వవిద్యాలయం పీజీ కేంద్రాన్ని వర్సిటీగా ఉన్న తి కల్పించారు. అయితే వర్సిటీ ఏర్పాటు తర్వాత ప్రగతిపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం మాత్రం డిమాండ్‌ కోర్సులు, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభం వంటి అంశాలపై దృష్టి పెట్టారు.  
ప్రస్తుతం వర్సిటీలో 22 కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభించారు. సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్‌ బ్రాంచ్‌లు ప్రారంభించారు. 180 సీట్లకు 178 ప్రవేశాలు జరిగాయి. వచ్చే ఏడాది సివిల్, కెమికల్‌ ఇంజినీరింగ్‌లు ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

అయితే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో వర్సిటీ కోర్సులు నిర్వహిస్తోంది. ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటేనే ఇంజినీరింగ్‌ కళాశాల బలోపేతం సాధ్యమవుతుంది. వర్సిటీ ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ 12(బి), నాక్, ఎన్‌బీఏ వంటి గుర్తింపులు లేవు.

ఎల్‌ఎల్‌బీ కోర్సుకు బార్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు లేదు. ఈ ఏడాది వర్సిటీలో ప్రవేశానికి సొంతంగా బీఆర్‌ఏయూ ఎస్‌కేఎల్‌ఎం సెట్‌ నిర్వహించారు. సోషల్‌ వర్కు, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌ఎం, రూరల్‌ డెవలఫ్‌ మెంట్, ఎంఈడీ, జియోలజీ, ఎంజేఎంసీ, ఇంగ్లీష్‌ వంటి కోర్సుల్లో కనీస ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి.

భవిష్యత్‌లో ఈ కోర్సుల మనుగడ సైతం కష్టంగా మారుతుంది. ప్రస్తుతం వర్సిటీకి ఐదు ప్రొఫెసర్, 10 అసోసియేట్‌ ప్రొఫెసర్, 33 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరయ్యాయి. అవి భర్తీ దశలో ఉన్నాయి.

గత నెల 27 నుంచి 29 వరకు ఐదు ప్రొఫెసర్, 8 అసోసియేట్‌ ప్రొఫెసర్, రెండో బ్యాక్‌ లాగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. కోర్టు వివాదం నేపథ్యంలో నియామకాలు ప్రస్తుతం నిలిచిపో యాయి. వర్సిటీ ప్రగతి సాధించాలంటే బడ్జెట్‌ పెంచటం, సిబ్బం దిని పెంచడం, పరీక్షల నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేయడం చాలా అవసరం.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement