గత ఏడాది సరఫరా చేసిన యూనిఫామ్స్ సరిపోక విద్యార్థుల ఇక్కట్లు...,2014లో సరఫరా చేసిన పచ్చరంగు యూనిఫామ్
రాయవరం (మండపేట): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో.. అందరూ సమానమనే భావన కలిగించేందుకు ప్రభుత్వం ఏటా యూనిఫామ్స్ పంపిణీ చేస్తోంది. విద్యా హక్కు చట్టంలో భాగంగా ఒకటో తరగతి నుంచి ఎని మిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. అయితే వీటి పంపిణీ ఏటా అపహాస్యంపాలవుతోంది. ఒక్కో ఏడాది ఒక్కో రంగులో వస్త్రాన్ని సరఫరా చేస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మాదిరిగా కాకుండా ఈ ఏడాదైనా విద్యార్థుల సైజులకు సరిపడా యూనిఫామ్ సరఫరా చేయాలని పలువురు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో యూనిఫామ్ రంగు మార్చారు. విద్యార్థులు ధరించే యూనిఫామ్‌లో ప్యాంట్/స్కర్ట్ రంగులో మార్పు లేనప్పటికీ షర్ట్ రంగు, డిజైన్ మార్చారు. గతంలో గళ్లతో కూడిన స్కైబ్లూ రంగు షర్ట్ సరఫరా చేయగా ఈసారి ప్లెయిన్ నీలి రంగు షర్ట్‌ను సరఫరా చేశారు. అంతకు రెండు సంవత్సరాల ముందు పచ్చ రంగు ప్యాంట్, షర్ట్ పంపిణీ చేశారు. గత విద్యా సంవత్సరంలో పంపిణీ చేసిన యూనిఫామ్ నాణ్యత బాగా నాసిరకంగా ఉందని, షర్ట్ వివిధ రకాల షేడ్స్‌లో పంపిణీ చేశారు. దూరం దూరంగా కుట్లు వేయడంతోపాటు ఇచ్చిన కొద్ది రోజులకే దుస్తులు విడిపోతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు.
మూడు నెలలు ఆలస్యంగా..
జిల్లాలో ఉన్న 3,347 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 3.24 లక్షల మంది విద్యార్థులకు గత ఏడాది యూనిఫామ్ పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోనూ అంతే సంఖ్యలో ఒక్కొక్కరికి రెండేసి జతల వంతున పంపిణీ చేయాల్సి ఉంది. పాఠశాలలుపునఃప్రారంభం నాటికి అందజేయాల్సి ఉండగా గత ఏడాది సెప్టెంబర్ నాటికి 2.43 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే సరఫరా చేశారు. అనంతరం కొద్ది నెలల తేడాలో 81 వేల మంది విద్యార్థులకు అందజేశారు. ఒక్కో యూనిఫామ్‌కు క్లాత్ ఖర్చుల కింద రూ.160, కుట్టు ఖర్చుల కింద రూ.40ను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఏటా ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు విద్యా హక్కు చట్టం కింద యూనిఫామ్ పంపిణీ చేస్తున్నారు. క్లాత్, కుట్టే బాధ్యతను ఆప్కో సంస్థ దక్కించుకుంది. సాధారణంగా ఏటా క్లాత్‌ను ఆప్కో సంస్థ సరఫరా చేస్తుండగా గత విద్యా సంవత్సరంలో దుస్తులు కుట్టే బాధ్యతను ఆప్కో చేజిక్కించుకుంది.
నామమాత్రమవుతున్న ఎస్‌ఎంసీలు...
యూనిఫామ్స్ క్లాత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తే పాఠశాల ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో స్థానికంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు కుట్టు బాధ్యతను అప్పగించాల్సి ఉంది. ఏటా యూనిఫామ్‌ను మహిళా శక్తి సంఘాల ద్వారా స్థానికంగా ఉన్న టైలర్లకు అప్పగించగా, గత ఏడాది మాత్రం ఆప్కో సంస్థ కుట్టు బాధ్యతలు తీసుకుంది. తరగతుల వారీగా కొలతలతో కుట్టి సరఫరా చేయడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. క్షేత్రస్థాయిలో విద్యార్థుల శారీరక కొలతలకు, సరఫరా చేసిన యూనిఫామ్ కొలతలకు మధ్య తేడాలుండడంతో విద్యార్థులకు ఏ మాత్రం సరిపడకపోవడంతో వాటిని ధరించలేని పరిస్థితి తలెత్తింది. సరిపడని యూనిఫామ్‌ను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు తిరిగి ఇచ్చేశారు. ఉపాధ్యాయులు సర్దుబాటు చేయలేక, సమాధానం చెప్పలేక తలలు పట్టుకున్నారు. యూనిఫాం మారుస్తామని అధికారులు చెప్పినా, కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాదైనా క్లాత్‌ను సరఫరా చేసి, కుట్టు బాధ్యతను ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో స్థానిక టైలర్లకు అప్పగిస్తేనే ప్రయోజనం ఉంటుందని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే ఎస్‌ఎంసీలు నామమాత్రంగా మిగిలే అవకాశం ఉంటుంది.
పాఠశాలలు పునఃప్రారంభానికి..
పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫామ్స్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు అడిగిన ఇండెంట్ పెట్టాం. వచ్చే విద్యా సంవత్సరానికి 3 లక్షల ఆరు వేల 303 మందికి యూనిఫాం సరఫరా చేయనున్నాం. యూనిఫాం క్లాత్ సరఫరా అవుతుందా? కుట్టిన యూనిఫామ్స్ సరఫరా అవుతుందా? అనే విషయం రాష్ట్రస్థాయిలో నిర్ణయమవుతుంది.
– మేకా శేషగిరి, పీవో, ఎస్‌ఎస్‌ఏ, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment