Jaipal Reddy
సాక్షి, హైదరాబాద్: దేశంలో శాస్త్ర పరిశోధనలకు మరింత ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతం నిధులను పరిశోధనలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నామని, పరిశోధనల్లో ప్రైవే టు రంగానికీ భాగస్వామ్యం కల్పించేందుకు పలు పథకాలను రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 70వ వార్షికోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన జైపాల్‌రెడ్డి ప్రసంగిస్తూ... శాస్త్రీయ దృక్పథం కేవలం పరిశోధన శాలలకే పరిమితం కారాదని, సామాన్యుడి జీవితంలోని అన్ని పార్శ్వాలనూ స్పృశించాలని ఆకాంక్షించారు.
ఐఐసీటీ తన పరిశోధనల ద్వారా సామాన్యుడికి చేరువయ్యే యత్నం చేస్తూనే ఉందని కొనియాడారు. ఓజోన్ పొర విచ్ఛిన్నాన్ని తగ్గించే ‘హెచ్‌ఎఫ్‌సీ 134’ రసాయనాన్ని అభివృద్ధి చేసినా, లీటర్‌కు ఏడు పైసల వ్యయంతోనే మంచినీరు అందించే మెంబ్రైన్ సాంకేతికతను సిద్ధం చేసినా, కేన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులకు చవకైన చికిత్సలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. అదంతా ఐఐసీటీకే చెల్లిందని ప్రశంసించారు. సీఎస్‌ఐఆర్ పరిశోధనశాలలు అభివృద్ధి చేసిన, చేస్తున్న టెక్నాలజీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తోడ్పడుతుందని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ సంచాలకులు లక్ష్మీకాంతం, శాస్త్రవేత్తలు అహ్మద్ కమాల్, ఆర్.బి.ఎన్.ప్రసాద్, సంస్థ మాజీ సంచాలకులు పుష్పా ఎం.భార్గవ, కె.వి.రాఘవన్ తదితరులు హాజరయ్యారు.
కేన్సర్ పరిశోధనలకు ప్రత్యేక కేంద్రం: ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల్లో భాగంగా సంస్థ ఆవరణలో ఏర్పాటుకానున్న మూడు కొత్త విభాగాలను జైపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. కేన్సర్ చికిత్సకు ఉపయోగపడే సరికొత్త రసాయన మూలకాలను గుర్తించేందుకు కేన్సర్ థెరప్యూటిక్ రీసెర్చ్ సెంటర్ అందులో ఒకటి. దాంతోపాటు.. వ్యాధికారక కీటకాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు, తద్వారా సాంక్రమిక వ్యాధులను నియంత్రించేందుకు ఐఐసీటీ ‘మెటిరిలాజికల్ టవర్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ ఆన్ వెక్టార్ కంట్రోల్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది.
సామాన్యుడి కోసం కృషిచేస్తాం..
‘‘పర్యావరణ అనుకూల ఇంధన వనరుల అభివృద్ధి, వేర్వేరు వ్యాధుల చికిత్సకు అవసరమైన మందుల ధరలను అందరికీ అందుబాటులోకి తేవడం, రసాయన పరిశ్రమల్లో కాలుష్యాన్ని తగ్గించి వాటిని సుస్థిర అభివృద్ధి వైపు నడిపించడం ప్రస్తుతం మా ముందున్న లక్ష్యాలు, వీటితోపాటు అత్యాధునిక పదార్థాల అభివృద్ధి, వ్యవసాయ సంబంధిత పరిశోధనలూ కొనసాగిస్తాం. సామాన్యుడికి అవసరమైన పరిశోధనలు చేసేందుకు పునరంకితమవుతాము’’
- లక్ష్మీకాంతం, ఐఐసీటీ హైదరాబాద్ సంచాలకులు