'మంత్రి డైరెక్షన్‌లోనే భారీ అవినీతి'
విజయవాడ సెంట్రల్:
కార్మికుల రక్తం పీలుస్తున్న కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికశాఖలో అవినీతి అంతా మంత్రి డెరెక్షన్‌లోనే జరుగుతోందని విమర్శించారు. ఐటీఐ కళాశాలల్లో రూ.7,500లుగా ఉన్న ఫీజును ఏకంగా రూ.16,500కు పెంచేశారని మండిపడ్డారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యం నుంచి వందల కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. పరికరాల కొనుగోలు, శిక్షణా తరగతుల నిర్వహణ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పారు.
కార్మిక, ఉపాధి శాఖ జేడీ మునివెంకటనారాయణ ఇంటిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఆ శాఖ అవినీతి బట్టబయలైందన్నారు. తామేమీ ఆరోపణలు చేయడం లేదని, నైపుణ్యాల శిక్షణ పేరిట తప్పుడు సంస్థలకు బిల్లుల చెల్లింపు, పరికరాల కొనుగోలులో అవినీతి, ప్రైవేటు కళాశాలల యాజమాన్యం నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారని ఏసీబీ, విజిలెన్స్ దర్యాప్తులో బయటపడిందని గౌతంరెడ్డి చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు కార్మికశాఖలో జరిగిన అవినీతిపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. చీటికి మాటికి ప్రతిపక్షాలపై విమర్శలు చేసే ఆయన తన సొంత శాఖలో జరిగిన అవినీతిపై మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన ‘ఆలీబాబా 40 దొంగల’ కథనుతలపిస్తోందని గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవాలని చంద్రబాబు 40 మంది దొంగల్ని రాష్ట్రం మీదకు పంపారని ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్‌ను చంద్రన్న చలువ పందిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, వ్యాపారవేత్తలకు సన్మానాలకు ఖర్చు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కార్మికుల బీమా ప్రీమియంను సొంత ప్రచారానికి వాడుకున్నారన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుపై మహిళలను వేధించడం, హత్యానేరం కేసులు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి మంత్రిని మంత్రివర్గంలో కొనసాగించడం సిగ్గుచేటని, తక్షణమే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు.