
కమనీయం..అప్పన్న జలవిహారం
సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం గురువారం సాయంత్రం కనుల పండవగా జరిగింది. వేణుగోపాలస్వామి...
సింహాచలం, న్యూస్‌లైన్: సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం గురువారం సాయంత్రం కనుల పండవగా జరిగింది. వేణుగోపాలస్వామి అలంకారంలో స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై కోనేరులో హంస వాహనంపై నౌకా విహారం చేశారు. పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఉత్సవంలో అశేష భక్తజనం పాల్గొని స్వామి తెప్పోత్సవాన్ని కనులారా తిలకించి, పులకించారు. స్వామివారిని మధ్యాహ్నం 4 గంటలకు మెట్ల మార్గం ద్వారా కొండదిగువకు తీసుకొచ్చారు.
తొలిపావంచా వద్దకు స్వామికి అడవివరం గ్రామస్తులు, దేవస్థానం అధికారులు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామిని తిరువీధిగా కోనేరు వద్దకు తీసుకెళ్లారు. సాయంత్రం 6 గంటల సమయంలో కోనేరులో హంస వాహనంపై స్వామిని అధిష్టించి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. కోనేరు మధ్యలో ఉన్న మండపం చుట్టూ మూడుసార్లు హంస వాహనాన్ని ప్రదక్షిణగా తిప్పి, మండపంలో స్వామివారికి షోడశోపచార పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి సర్వజన మనోరంజని వాహనంపై అధిష్టించారు. దేవస్థానం ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు, దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ స్వామిని దర్శించుకున్నారు. విద్యుద్దీపాలంకరణ, బాణసంచా వెలుగులు ఈ వేడుకకు శోభను తీసుకువచ్చాయి.