చెట్టెక్కిన చదువు
Published Mon, Jan 13 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: అమ్మా,నాన్నా..నేను బాగా చదువుతున్నాను.. అందరికంటే నాకే ఎక్కువ మార్కులొచ్చాయి..నాకు స్కూ లు ఫస్ట్ వచ్చింది..అని విద్యార్థులు ఇంట్లో చెప్పుకుంటే వారికి అవధుల్లేని ఆనందం కలుగుతుంది. బాగా చదివే విద్యార్థికి ఇలా సంతోషంగా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. పాఠ్యాంశాల్లో అంతగా ప్రతిభ చూపలేని విద్యార్థులకు సైతం ‘ఎ’ గ్రేడ్ వస్తుండడంతో బాగా చదివే విద్యార్థులు నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు. ఫలితంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువు చెట్టెక్కుతోంద నే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి ప్రణాళిక లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధానంపై ఉపాధ్యాయులకు సరైన అవగాహన లేకపోవడం, పర్యవేక్షణ లోపం, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో తేడాలు వంటి అంశాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. రాజీవ్ విద్యామిషన్ ప్రవేశ పెట్టిన సమగ్ర మూల్యాంకన (గ్రేడింగ్) విధానం ఇంకా గాడిలో పడలేదు. పరీక్షలపై విద్యార్థుల కున్న భయాన్ని పోగొట్టేందుకు గత విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించిన గ్రేడింగ్ ప్రక్రియ ప్రహసనంగా మారింది.సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఇటీవ ల జరిగిన త్రైమాసిక పరీక్షల ఫలితాల విడుదల తర్వాత జిల్లా విద్యారంగంలో గ్రేడింగ్ విధానం చర్చనీయాంశమైంది. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ విధానం కొనసాగుతుండడంతో విద్యార్థుల్లోనూ అయోమయం నెలకొంది.
ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు రాజీవ్ విద్యామిషన్ ఒకటి నుంచి 8వ తరగతి వరకూ జరిగే పరీక్ష విధానంలో గత విద్యాసంవత్సరం నుంచి సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులు, ఎలాంటి రాతపరీక్షలూ నిర్వహించరు. పాఠ్యాంశాల బోధన కంటే ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది. తద్వారా సామర్థ్యాన్ని అంచనా వేయాలి. జూన్ రెండో వారంలోనే విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించాలి. యూనిట్ టెస్ట్‌లకు బదులుగా ఫార్మాట్, త్రైమాసిక పరీక్షలకు బదులుగా సమ్మేట్‌లను చేపట్టాలి. ఫార్మాట్‌లో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి ఐదు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టాలి. వారు సమాధానాలు చెప్పే విధానాన్ని బట్టి ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. సమైక్యాంధ్ర ఉద్యమ సమ్మె నేపథ్యంలో త్రైమాసిక పరీక్షల సమ్మేట్ మినహా ఏవీ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.
సామర్థ్యం కలిగిన విద్యార్థికి తక్కువ గ్రేడింగ్
జిల్లాలో ఇటీవల జరిగిన సమ్మేట్ పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే బాగా చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూతన విధానంలో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కోలా గ్రేడింగ్ ఇస్తారు. ఉదాహరణకు సాంఘికశాస్త్రం సబ్జెక్ట్‌లో ఆరు సామర్థ్యాలు ఉం టాయి. ఇందులో పాఠాలను అవగాహన చేసుకోవడం, మ్యాప్‌లో ప్రాంతాలను గుర్తించడం, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని చర్చిం చడం, సునిశిత విమర్శ (చెప్పిన అంశంపై సొంతంగా స్పందించి మాట్లాడడం, రాయ డం), ప్రాజెక్టువర్క్‌లో భాగంగా గ్రామాల్లో జరుపుకొనే పండగలు, నీటి సరఫరా ఏవిధంగా జరుగుతోందనే అంశాలుంటాయి. వీటిలో విద్యార్థి చూపిన సామర్థ్యం ఆధారంగా గ్రేడింగ్ నిర్ణయించారు. ఐదు కరెక్టుగా చెప్పి.. ఒకటి తప్పు అయితే ఎ గ్రేడ్ వస్తుంది. మూడు ఎ గ్రేడ్, రెండు బి గ్రేడ్‌లు వస్తే బి గ్రేడ్ వస్తుంది. కొందరు కేవలం మ్యాపింగ్ ప్రాంతాలను కరెక్టు గా చూపించినా గ్రేడింగ్ ఉన్నతంగా ఉంటుంది. దీంతో బాగా అభ్యసించే విద్యార్థికి తక్కువ గ్రేడింగ్ వస్తోంది. ఫలితంగా ఆ విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గిపోతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త విధానంలో లోపాలు
సమగ్రమూల్యాంకనంపై రాజీవ్ విద్యామిష న్ గత వేసవిలో ప్రతి ఉపాధ్యాయునికి ఇచ్చిన శిక్షణ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేకపోయింది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 30:1 కాకుండా అధిక పాఠశాలల్లో 50:1కి మించి ఉంది. దీంతో ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ చూపించే సమయం లేకపోతోంది. అధిక శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొక్కుబడిగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తున్నా రు. నిబంధనల మేరకు డైట్ లెక్చరర్లు, ఎంఈ ఓలు నిర్వహించాల్సిన పర్యవేక్షణ కొరవడుతోంది. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు గ్రేడింగ్ విధానాన్ని అయినా సక్రమంగా అమలులోకి తీసు కురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Advertisement