చిత్తూరు నగరంలో ఇంటింటా విచారిస్తున్న వార్డు వలంటీర్లు
సాక్షి, చిత్తూరు: కరోనాను నియంత్రించడంలో భాగంగా ఇప్ప టివరకు విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారి వివరాల కోసం ఆరాతీసిన యంత్రాంగం తాజాగా ఢిల్లీలోని ఓ ప్రార్థన కోసం వెళ్లి వచ్చిన వారిపై దృష్టి సారించింది. ఇప్పటికే అధికారులు పలువురిని గుర్తించి హోమ్ ఐసొలేషన్ (స్వీయగృహనిర్బంధం) లో ఉంచారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు..? ఎవరెవర్ని కలిశారు..? ఎన్ని రోజులైంది? అని ఆరా తీస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వారి వివరాల సేకరణలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. పనిలో పనిగా విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు సైతం ఎక్కడైనా ఉంటే గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. (ఒక్కరోజే 21 కరోనా పాజిటివ్)
దృష్టంతా వారిపైనే..
ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్థనకు దేశవ్యాప్తంగా 2వేల మందికిపైగా హాజరైనట్లు సమాచారం. ఈ సమావేశానికి దాదాపు 200 మంది విదేశీయులు కూడా హాజరుకావడంతో పలువురికి కరోనా సోకినట్లు గుర్తించారు. మన రాష్ట్రం నుంచి 369 మంది హాజరవగా.. జిల్లా నుంచి 46 మంది వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇప్పటివరకు 28 మందిని మాత్రమే గుర్తించిన అధికారులు మిగిలిన 18 మంది ఆచూకీ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. 28 మందిలో శ్రీకాళహస్తి నుంచి 8 మంది, పీలేరులో 8, పుంగనూరులో ఒకరిని, చిత్తూరులో ఇద్దరిని, కురబలకోటలో ముగ్గురిని, తిరుపతిలో ఆరుగురిని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. అందరి రక్తనమూనాలను సేకరించారు. త్వరలోనే వాటి ఫలితాలు రానున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన వారిలో మిగిలిన 18 మంది వివరాలను తెలుసుకోవడానికి జిల్లా మొత్తం వలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వే చేయిస్తున్నారు.
విదేశీయులు ఇలా..
అలాగే ఇప్పటి వరకు విదేశాల నుంచి 1,816 మంది వచ్చినట్లు యంత్రాంగం గుర్తించింది. వారిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచింది. గృహ నిర్బంధానికి ఇష్టపడని వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించింది. ఇప్పటివరకు సుమారు 1,472 మందికి క్వారంటైన్ పూర్తయ్యింది. వారిలో 86 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి మాత్రం పాజిటివ్ వచ్చింది. 55 మందికి నెగటివ్ రాగా.. 30 మంది ఫలితాల వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ ఫలితాల కోసం యంత్రాంగం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అలాగే పోలీసులు కూడా ప్రతి స్టేషన్ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారికోసం ఆరా తీస్తున్నారు.
వెంటనే ఫోన్ చేయండి
కరోనా లక్షణాలు ఎవరిలో కనిపించినా సమాచారం ఇవ్వాలి. విదేశాల నుంచి వచ్చిన వారిని దాచినా, ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నా తప్పనిసరిగా డయల్–100, 104, ఫోన్– 08572–235900, 9441486168, 9849902379 నంబర్లకు ఫోన్ ద్వారా తెలియజేయాలి. వెంటనే పోలీస్, వైద్యశాఖ సిబ్బంది రంగంలోకి దిగి వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తారు. అలాగే ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను కూడా అధికారులకు అందించాలి.
జమాత్‌కు వెళ్లిన వారు క్వారంటైన్ సెంటర్‌కు..
పలమనేరు: నియోజకవర్గం నుంచి జమాత్‌కి వెళ్లొచ్చిన 37 మందితోపాటు కుటుంబ సభ్యులతో కలిపి 150 మందిని అధికారులు మంగళవారం క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. వీరు అసోం, తమిళనాడులోని ఆంబూర్,పూణేలో జరిగిన జమాత్‌కు వెళ్లొచ్చినట్లు తెలిసింది. దీంతో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి హోమ్ ఐసొలేషన్‌లో ఉచారు. మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడుకు కాలినడకన వెళ్తున్న మరో పదిమంది వలస కూలీలను పోలీసులు స్థానిక బీసీ హాస్టల్‌కు తరలించారు. వీరికి వసతి సౌకర్యాలను కల్పించినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు.
13 మంది రుయాకు తరలింపు
శ్రీకాళహస్తి: న్యూఢిల్లీ నిజాముద్దీన్‌లో నిర్వహించిన జమాత్‌కు వెళ్లిన వారిపై వలంటీర్లు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాళహస్తికి చెందిన 13మందిని తిరుపతి క్వారంటైన్‌కు పంపించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన 13 మందిని వైద్యపరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment