12,671 గ్రామ సచివాలయాలు | Grama Volunteers Jobs In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

12,671 గ్రామ సచివాలయాలు

Published Tue, Jul 9 2019 4:22 AM | Last Updated on Tue, Jul 9 2019 11:25 AM

Grama Volunteers Jobs In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 12,671 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు పంచాయితీరాజ్‌ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ సచివాలయాల ఉద్యోగుల నియామకాల కోసం చర్యలు చేపట్టాలని సూచిస్తూ వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, 13 జిల్లాల కలెక్టర్లకు పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ సోమవారం లేఖలు రాశారు. జిల్లాలవారీగా గ్రామ సచివాలయాల సంఖ్య, ఉద్యోగుల వివరాలను శాఖలవారీగా తెలియజేస్తూ అందుకు అనుగుణంగా నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అక్టోబరు 2వతేదీ నాటికి గ్రామ సచివాలయాల వ్యవస్థ అమలులోకి వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతికి ఏమాత్రం తావులేకుండా, పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు వేగంగా చేరవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాను ప్రమాణస్వీకారం చేసిన రోజే గ్రామ సచివాలయాల ఏర్పాటుపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతి గ్రామ సచివాలయంలో పది మంది చొప్పున కొత్తగా ఉద్యోగులను నియమిస్తామన్నారు. వీరిని పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తిస్తామని భరోసా ఇచ్చారు. 

సీఎం ఆదేశాల మేరకు ప్రణాళిక సిద్ధం  
గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 13,065 గ్రామ పంచాయితీలను పంచాయితీరాజ్‌ శాఖ 12,671 గ్రామ సచివాలయాలుగా వర్గీకరించింది. తొలుత 9,480 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలని భావించినా ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీటిని 12,671కి పెంచుతూ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇతర కీలకాంశాలు

  • గ్రామ సచివాలయాల్లో నియమించే వారిని పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ఉద్యోగంలో నియమించిన మొదటి రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా ఉంచి గౌరవ వేతనం అందజేస్తారు.
  • గ్రామ సచివాలయాల సిబ్బందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియమిస్తారు. వీరికి సంబంధిత శాఖలు తగిన విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తాయి.
  • గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పర్యవేక్షణకు సంబంధిత శాఖలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకోవాలి.
  •  కేవలం సంబంధిత శాఖ వ్యవహారాలకే పరిమితం కాకుండా గ్రామ సచివాలయ పరిధిలో ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉండాలి.

ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు
ఒక్కో గ్రామ సచివాలయంలో పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో మొత్తం 11 మంది చొప్పున ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే చోట మరికొంత మందిని అదనంగా నియమించే అవకాశం ఉందని పంచాయితీరాజ్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వివిధ రకాల ఉద్యోగుల పర్యవేక్షణ బాధ్యతలు పంచాయితీరాజ్, రెవెన్యూ, వైద్యారోగ్య, పశుసంవర్ధక, మహిళా శిశు సంక్షేమం, పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం, వ్యవసాయం, ఉద్యానవన, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఉంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement