
ఘనంగా ఈదుల్ ఫితర్
కొత్త జుబ్బా పైజామాలు... సరికొత్త రంగురంగుల టోపీలు.. అత్తరు గుబాళింపులు... దూద్‌సేమియాల ఘుమఘుమలతో నగరంలో ఈదుల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే నగరంలోని వన్‌టౌన్, పూలబజార్, గడియారం ఆసుపత్రి ప్రాంతం, గడ్డా వీధి, పాతబస్టాండ్, రాజ్‌విహార్, కొత్తబస్టాండ్, మద్దూర్‌నగర్, క్రిష్ణానగర్, అబ్బాస్‌నగర్ తదితర వీధులలో ముస్లింల సందడి కనిపించింది. ఉదయం 8కే జొహరాపురం సమీపంలోని ఈద్గాలలో ఈదుల్‌ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఉదయం 9:30కి పాత ఈద్గాలో నమాజు ప్రారంభమైంది. పాత ఈద్గాలో జరిగిన ఈదుల్ ఫితర్ నమాజులో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గఫూర్, ఎస్పీ రవికృష్ణ పాల్గొన్నారు.
సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలో ఉదయం 10:30 గంటలకు ఈదుల్‌ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఆయా ఈద్గాలలో ప్రపంచలోని మానవులందరూ సుఖశాంతులతో నివసించేటట్లు భగవదనుగ్రహం లభించాలని దువా(ప్రార్థన) చేశారు. నమాజు అనంతరం ముస్లింలు రహదారులపై నడిచివస్తుండగా పలువురు హిందూమిత్రులు వారిని ఆలింగనం చేసుకొని ఈద్‌ముబారక్ తెలిపారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముస్లింలంతా రంజాన్‌ను ఘనంగా నిర్వహించుకున్నారు.
- కర్నూలు, కల్చరల్