కోటిపుణ్యాల ప్రదాయిని రమజాన్ | Grand celebrations of Ramajan | Sakshi
Sakshi News home page

కోటిపుణ్యాల ప్రదాయిని రమజాన్

Published Mon, Jun 30 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

Grand celebrations of Ramajan

కడప కల్చరల్ : సకల పుణ్యప్రదాయిని, సమస్త రుగ్మతల నాశిని, ఆరోగ్య ప్రదాయిని, పవిత్ర ఖురాన్ అవతరించిన పవిత్ర మాసం రమజాన్. సద్భావన, సామరస్య భావనకు, సర్వమానవ సమతకు ఎత్తిన విశ్వాస కేతనం రంజాన్. మానవుడు తనలోని పశుత్వాన్ని పారద్రోలి, నిండైన మానవత్వాన్ని సంతరించుకొని దైవానికి కృతజ్ఞతలు చెల్లించే అవకాశం కల్పించే శుభాల వరాల మాసం ఇది.
 
 ఆదివారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలందరూ సంతోషంతో రంజాన్ ఉపవాసాల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించారు. చంద్రోదయం అయిందని అందరికీ తెల్పుతూ మసీదుల వద్ద నిర్వాహకులూ, భక్తులూ, ముస్లిం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు   టపాసులు పేల్చారు. మసీదుల్లో  ఇప్పటికే నిర్వాహకులు ఉపవాస దీక్షలు చేపట్టనున్న భక్తులకు అన్ని వసతులతో ఏర్పాట్లు చేశారు. అలాగే కడప నగరంలోని కొన్ని మసీదుల్లో భక్తుల కోసం సెహరీ (ఉపవాస దీక్ష చేపట్టే ముందు తీసుకునే ఆహారం) ఏర్పాట్లు చేశారు.
 
 సోమవారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఒక్కరూ అల్లాహ్ ఆదేశానుసారం రోజా (ఉపవాసం) ఉంటూ ఆయన చూపిన మార్గంలో పయనించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. నెల ప్రారంభం నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉపవాస దీక్ష ప్రారంభానికి అవసరమైన ఆహార పదార్థాలను సిద్ధం చేసుకుంటారు.
 
 కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి భక్తి పూర్వకంగా సెహరీ స్వీకరిస్తారు. దీక్ష ప్రారంభ సమయం ముగియగానే ప్రార్థనల కోసం సమీప మసీదులకు వెళ్లి తమ పాపాలను క్షమించాలని, తమ ఉపవాసాలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని, రంజాన్ నెల పుణ్యఫలాలను దక్కేలా చూడాలని వేడుకుంటారు. సాయంత్రం ఇఫ్తార్ (ఉపవాస దీక్ష విరమణ), రాత్రి ఇషా నమాజ్ తర్వాత తరావీ ప్రత్యేక ప్రార్థనలకు ఆయా మసీదు నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
 
 ఉత్తమ జీవన విధానం...
 రంజాన్ మాసం మానవులకు ఉత్తమ జీవన విధానాన్ని అలవాటు చేస్తుంది. ఈ సందర్భంగా చేపట్టే ఉపవాసాలు దైవం పట్ల భక్తి పెరిగేందుకు దోహదం చేస్తాయి.
 
 నిర్ణీత సమయానికి మేల్కోవడం, సూర్యోదయానికి పూర్వమే పరిమితంగా, సమతుల ఆహారం స్వీకరించడం, సూర్యాస్తమయం వరకూ కనీసం మంచి నీళ్లయినా తీసుకోకుండా ఐదుమార్లు దైవారాధనతో గడిపి, ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించి మితాహారం తీసుకోవడం, కొద్దిసేపు విశ్రాంతి, ఆ వెంటనే అనందంగా ఆరాధనలు (తరావీ) చేయడం ఈ పవిత్ర మాసంలో అలవడుతుంది.
 
  పవాసాలు పేదల ఆకలిని తెలుసుకొనేందుకు, ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడితే, నిర్ణీత సమయంలో నిద్ర మేల్కొనడం క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేస్తాయి.
 ఐదుమార్లు దైవారాధన దైవం పట్ల భక్తిని పెంచి మానవుల్లో ఉన్నత విలువలు, ఉత్తమ గుణాలు పెంచేందుకు తోడ్పడతాయి. ఈ పండుగ సందర్భంగా చెల్లించే జకాత్, ఫిత్రాల వల్ల దానగుణం అలవడుతుంది.    
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement